ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party).. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య నువ్వానేనా అనే స్థాయిలో యుద్ధం నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వానేనా అనే స్థాయిలో యుద్ధం నడుస్తోంది. టీడీపీ ముఖ్యనేతలకు షాకిచ్చేందుకు వారి సొంత నియోజకవర్గాలను వైసీపీ టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా ఇలా వారి సొంత నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మూడు దశల ఎన్నికల్లో టీడీపీ ముఖ్యనేతలకు వైసీపీ చెక్ పెట్టింది. ఇప్పుడు మరో నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అదే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతనిథ్యం వహిస్తున్న హిందూపురం. ఇప్పుడు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాకిస్తుందా..? లేక వైసీపీ స్పీడ్ కు బాలయ్య అడ్డుకట్టవేస్తాడా..? అనే చర్చ జరుగుతోంది.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపురం రూరల్, చిలమత్తూరు, లేపాక్షి మండలాలున్నాయి. 40కి పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 1983 నుంచి హిందూపురంలో టీడీపీకి తిరుగులేదు. ఇక్కడి నుంచి తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ విజయం సాధించారు. 2014, 2019లో వరుసగా రెండుసార్లు బాలయ్య విజయం సాధించారు. రాష్ట్రమంతా వైసీపీ హవా నడిచినా... హిందూపురంలో బాలకృష్ణకు 17వేలకుపైగా మెజారిటీ వచ్చింది.
ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ విమర్శల పదును పెంచారు. లెక్క సరిచేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటీవలే హిందూపురంలో పర్యటించిన బాలయ్య.. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు. అంతేకాదు వైసీపీ హయాంలో పరిశ్రమలు రావడం లేదని.. యువతకు ఉపాధి కరువైందన్నారు. మద్యం, గంజాయి వంటివి మాత్రం చక్కగా దొరుకుతున్నాయని విమర్శలు కూడా చేశారు. మరోవైపు హిందూపురంలో ఏ ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. అన్ని పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. ఇటు టీడీపీ మద్దతుదారులు.. అటు వైసీపీ మద్దతుదారులు పోటీలో నిలిచారు. ఇరువర్గాలు ప్రచారాన్ని కూడా హీటెక్కించాయి. దీంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
కుప్పం విషయానికి వస్తే 89 పంచాయతీలకుగానూ 75 వైసీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన వైసీపీ ఆయనకు ఊహించని షాకిచ్చింది. 70 పంచాయతీల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీని 14 స్థానాలకే పరిమితం చేసింది వైసీపీ. రామకుప్పం, శాంతిపురం మండలంలో వైసీపీ స్వీప్ చేసింది. కుప్పంలో మొత్తం 1,68,058 ఓట్లు పోలైతే.. అందులో వైసీపీకి 31,149 ఓట్ల మెజారిటీ వచ్చింది. టీడీపికి 14 పంచాయతీల్లో 1,872 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి కుప్పం రిజల్ట్ తన నియోజకవర్గంలో రిపీట్ కాకుండా బాలయ్య అడ్డుకట్ట వేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే బాలయ్య అభిమానులు మాత్రం కుప్పం వేరు.. హిందూపురం వేరంటున్నారు. ఇక్కడ బాలయ్యను కొట్టేవారే లేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.