తెలంగాణ ఎన్నికల్లో విపరీతమైన అంచనాలు పెంచిన మహాకూటమి .. ఫలితాల దగ్గరికొచ్చేసరికి బోల్తాపడింది. ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణసమితి పార్టీలు కూటమిగా ఏర్పడి.. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందాయి. తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. దీంతో కూటమి కొనసాగింపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఓటమిపై కూటమినేతలు సంయుక్తంగా స్పందించలేదు. పార్టీలుగా ఫలితాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికగా.. పార్టీలన్నీ ఒకేవేదికపై వచ్చి కూటమిగా స్పందించలేదు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి కొనసాగుతుందా? లేదా?అనే సందిగ్ధత నెలకొంది.
తాజాగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు.. కూటమి కొనసాగింపుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటివరకూ ఓటమిపై కూటమిలో చర్చ జరగలేదని కోదండరాం అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ఉంటుందా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము మాత్రం పార్టీగా మనుగడ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలపై టీజేఎస్‌కు అంతర్గత ఆలోచన ఉందని చెప్పారు. ప్రజాసమస్యలపై తమ గొంతు వినిపిస్తామని, అందుకు తగినట్టు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కోదండరాం వ్యాఖ్యల ప్రకారం... తెలంగాణలో మహాకూటమి కథ ముగిసినట్టేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. మహాకూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి వల్లే ఓటమి పాలయ్యామని చాలామంది ఆరోపించారు. మరికొందరైతే, కూటమి వద్దని ముందే చెప్పినా నాయకత్వం వినలేదని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నామని బాహాటంగా కుండ బద్ధలు కొట్టారు.
అయితే, ఎక్కువ శాతం మంది కేవలం టీడీపీ వల్లే ఓడిపోయామని చెప్పారే తప్ప.. తెలంగాణ జనసమితి పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ జనసమితిని వదిలేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని మాత్రం దూరంగా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. లేదంటే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఎంపీ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు హెచ్చరిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని పక్కనబెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే, ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున.. అప్పటి పరిస్థితులను బట్టి తెలంగాణ మహాకూటమి మనుగడ కొనసాగిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Mahakutami, Tdp, Telangana, Telangana Jana Samithi, Telangana Lok Sabha Elections 2019, Telangana News, TS Congress