సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ నిండు నూరేళ్ల పాటు బతకాలని.. తాము టీఆర్ఎస్‌ని చంపుతుంటే ఆయన కళ్లారా చూడాలని అరవింద్ ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: September 17, 2019, 4:07 PM IST
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, సంజయ్
  • Share this:
కేసీఆర్ బతికుండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చనిపోవాలని మేం కోరుకోవడం లేదని.. నిండు నూరేళ్ల పాటు బతకాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము టీఆర్ఎస్‌ని చంపుతుంటే కేసీఆర్ కళ్లారా చూడాలని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం అధికారికంగా వేడుకలను జరపకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓవైసీకి కేసీఆర్ చెంచాగా మారారని, అందుకే సెప్టెంబర్ 17ని ఆయన జరుపుకోరని మండిపడ్డారు.

ఓవైసీకి కేసీఆర్ చెంచాలా మారిపోయారు. ఆయన మూడు టర్మ్‌లు సీఎంగా ఉండడం కాదు.. ఈసారే ప్రభుత్వం పడిపోతుంది. కేసీఆర్ నిండా నూరేళ్లు బతకాలని బీజేపీ కోరుకుంటోంది. ఆయన బతికి ఉండగానే టీఆర్ఎస్‌ను చంపుతాం. టీఆర్ఎస్‌ను చంపుతుంటే కేసీఆర్ తన కళ్లతో చూడాలి. నిజామాబాద్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైతే ఓటమిని చూశారో గజ్వేల్, సిద్దిపేటలోనూ చూడాలి. రాష్ట్రాన్ని మేమెందుకు శపిస్తాం. కేసీఆరే రాష్ట్రానికి శాపం. ఆయనకు పాలనపై పట్టు లేదు. మీ కేబినెట్ మంత్రులంతా డమ్మీలే.
ధర్మపురి అరవింద్


1947లో కేసీఆర్ లేరు. ఆయనకు పేరు రాదనే సెప్టెంబర్ 17ను జరుపుకోరు. నిజాం నుంచి స్వాతంత్ర్యం వస్తే వేడుకలు చేసుకోవద్దా? ఆంధ్రా నుంచి విడాకులు వస్తే సంబరాలు చేసుకుంటారా? దీనికంటే సెప్టెంబరు 17 ప్రాముఖ్యత ఎక్కువ. హిందువులపై మీరు చేసిన వ్యాఖ్యలను ఇంకా ఎవరూ మరవలేదు. ప్రజల ద్వేషాన్ని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారు. కేసీఆర్ వెంట ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆందోళన నెలకొంది. అందుకే టీఆర్ఎస్‌ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ప్రమేయం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుంది.
ధర్మపురి అరవింద్
అరవింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారని ఎదురుదాడికి దిగారు. సీఎంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

అరవింద్ వీడియో ఇక్కడ చూడండి:


First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>