చంద్రబాబు హామీని జగన్ నెరవేరుస్తారా..? ఖాళీ ఖజానా అడ్డంకి అవుతుందా..?

ఏపీలో 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిలో మొత్తం రూ.84 వేల కోట్లలో అన్ని లెక్కలు వేసి రూ.24 వేల కోట్లను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. తీరా అమలుకు వచ్చే సరికి.. మాఫీ అయిన రుణాలు రూ.15 వేల 200 కోట్లు మాత్రమే. చివరి రెండు విడతల మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా మాఫీ చేసేసినట్లు టీడీపీ ప్రకటించుకుంది. అయితే అదీ జరగలేదని తాజాగా వైసీపీ మంత్రులు ప్రకటించారు.

news18-telugu
Updated: June 19, 2019, 8:51 AM IST
చంద్రబాబు హామీని జగన్ నెరవేరుస్తారా..?  ఖాళీ ఖజానా అడ్డంకి అవుతుందా..?
చంద్రబాబు, వైఎస్ జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
(సయ్యద్ అహ్మద్-న్యూస్18, అమరావతి కరస్పాండెంట్)

ఏపీలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. అయితే అధికారంలోకి వచ్చాక వరుస కొర్రీలతో అరకొర మొత్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చి న రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తుందా? లేదా? అన్న చర్చ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.

గత టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ కోసం బాండ్లు జారీ చేసింది.వీటిని ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ బకాయి మొత్తాన్ని తేల్చిన మంత్రులు.. అమలు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ చెప్పడంతో రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు గత ప్రభుత్వం బకాయి పడ్డ నాలుగు, ఐదు విడతల మొత్తం రూ.8 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తారా? లేదా? అనే అంశంపై చర్చ సాగుతోంది.

రైతుల రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అది కేవలం టీడీపీ ఇచ్చిన హామీ మాత్రమే కాదని, ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీ కూడా అని చంద్రబాబు నిన్న పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే విపక్ష టీడీపీ ఈ అంశాన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేయాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.

మరోవైపు టీడీపీ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేసిన వైసీపీ సర్కారు... ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న వైఎస్సార్ రైతు భరోసాను మాత్రం వనరుల కొరత వల్ల ఖరీఫ్‌కు బదులుగా రబీ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. దీని పైనా రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.రుణమాఫీ బకాయిలను పూర్తిగా చెల్లించాలన్నా, వైఎస్సార్ రైతు భరోసా పథకం రబీ నుంచి అమలు చేయాలన్నా ప్రభుత్వం వద్ద తక్షణం వెేల కోట్ల రూపాయల నిధులు తప్పనిసరి. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తామెందుకు అమలు చేయాలని భావిస్తే మాత్రం రైతులకు ఈ సీజన్‌లో కష్టాలు తప్పవు. రుణమాఫీ బకాయిల విషయంలో రైతులు న్యాయస్ధానాలను ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన చేయక తప్పని పరిస్ధితి నెలకొంది.
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading