WILL HOT DISCUSSION HAPPEN IN TELANGANA CONGRESS POLITICAL AFFAIRS COMMITTEE MEETING AK
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రచ్చ తప్పదా ? ఆ భేటీలో ఏం జరగనుంది ?
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana Congress: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనుకూల వర్గం, వ్యతిరేకవర్గం ఉన్న నేపథ్యంలో.. ఈ భేటీలో ఈ అంశంపై ఇరు వర్గాలు వాడీవేడిగా వాదించుకునే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం మాట అటుంచితే.. ఆ పార్టీ వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జగ్గారెడ్డి ఆ పార్టీ హైకమాండ్‌కు రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంతో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ దీనిపై సీరియస్ అయ్యింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ముందుగా క్రమశిక్షణ పాటించని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కమిటీ ముందుకు పిలిస్తే.. తాను కూడా కమిటీ ముందు హాజరవుతానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందా ? లేక జగ్గారెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి జగ్గారెడ్డిని ఈ అంశంపై వివరణ కోరుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ నెల 5న టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ జరగనుంది.
ఈ కమిటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో జగ్గారెడ్డి అంశమే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనుకూల వర్గం, వ్యతిరేకవర్గం ఉన్న నేపథ్యంలో.. ఈ భేటీలో ఈ అంశంపై ఇరు వర్గాలు వాడీవేడిగా వాదించుకునే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఎవరినీ సంప్రదించకుండా రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అంశం కూడా టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చకు రావొచ్చని.. ఈ అంశంపైనే పలువురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యతిరకవర్గానికి కౌంటర్ ఇచ్చేందుకు ఆయన అనుకూల వర్గం కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే రాబోయే కాలంలో ఏయే అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలనే దానిపై చర్చించాల్సిన ఈ కమిటీలో... జగ్గారెడ్డి లేఖ అంశంపైనే జరిగే అవకాశం ఎక్కువగా ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు హుజూరాబాద్ ఫలితాలపై పోస్టుమార్టం గురించి ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. దానిపై కూడా వాదోపవాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకడంలో ఆయన ఐసొలేషన్‌లో ఉన్నారు.
దీంతో ఆయన వర్చువల్‌గా ఈ భేటీలో పాల్గొంటారా ? లేక టీపీసీసీ చీఫ్ సమావేశానికి రాలేని కారణంగా ఈ భేటీ వాయిదా పడుతుందా ? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది. ఇదిలా ఉంటే కొత్త ఏడాదిలో బీజేపీకి ధీటుగా తెలంగాణలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టాల్సిన అవసరం ఉందని.. దీంతో ఇప్పుడున్నట్టుగా గ్రూపు రాజకీయాలతో పార్టీ ముందుకు వెళితే నష్టపోవాల్సి ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. మొత్తానికి టీపీసీసీ పీఏసీ సమావేశంలో ప్రభుత్వంతో పోరాడే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతుందా లేక అంతర్గత విభేదాలపైనే ఎక్కువగా చర్చించుకుని మళ్లీ పాత పద్ధతిలోనే భేటీ సాగుతుందా ? అన్నది చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.