ఆంధ్రప్రదేశ్లో పారదర్శక పాలన అందిస్తానని ప్రకటించిన కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తొలి అస్త్రాన్ని బయటకు తీశారు. ఏపీలో రివర్స్ టెండరింగ్ చేపడతామని ప్రకటించారు. ఏపీలోని ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ధనం వృధాగా పోకుండా చూసేందుకు తాము రివర్స్ టెండరింగ్ విధానాన్ని చేపడతామన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే.. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకు మరోసారి టెండర్లు పిలుస్తారు. గతంలో కంటే తక్కువ ధరకు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే, ఆ ప్రాజెక్టు తక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఇస్తారు. దీన్ని బట్టి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు కట్టబెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ ఈ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ‘మా ప్రభుత్వం విప్లవాత్మకంగా ఉంటుంది. ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అవినీతి అనేదే లేకుండా చేస్తాం. రాష్ట్రాన్ని ఎలా మార్చాలో చేసి చూపిస్తాం. రివర్స్ టెండరింగ్ అమల్లోకి తెస్తాం.’ అని ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టులను ఎక్కువ ధరలకు కట్టబెట్టారని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు, టీడీపీ సభ్యులైన వారికే ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, దాని వల్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబులోకి వెళుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ విధానం సంచలనానికి దారితీయబోతుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:May 26, 2019, 15:54 IST