మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారికి తమ అంగీకారాన్ని తెలియజేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే ఆ మేరకు అంగీకారాన్ని తెలియజేయాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ శివసేనకు 24 గంటల గడువు ఇచ్చారు. ఆ గడువు ఈ రోజు 7.30తో ముగిసింది. దీంతో గడువు ముగియడానికి ముందే గవర్నర్ వద్దకు వెళ్లిన శివసేన యువనేత ఆదిత్యథాక్రే, మరికొందరు ముఖ్యనేతలు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, ఆయా పార్టీల నుంచి అంగీకారపత్రాలు రావడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు రెండు రోజులు గడువు కావాలని కోరారు. అయితే, ఈ వినతిని గవర్నర్ తోసిపుచ్చినట్టు తెలిసింది.
గవర్నర్తో భేటీ తర్వాత ఆదిత్య థాక్రే మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ మాకు 24 గంటల సమయం ఇచ్చారు. ఆలోపే మేం మా అంగీకారాన్ని తెలియజేశాం. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 48 గంటల గడువు కావాలని కోరాం. ఇతర పార్టీలు మాతో చర్చలు జరుపుతున్నాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మాతో చర్చిస్తున్నారు. ఆలస్యం చేయడం మా ఉద్దేశం కాదు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.’ అని ఆదిత్య థాక్రే చెప్పారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఫోన్లో మాట్లాడారు. శివసేన ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ అంశంపై పార్టీ సీడబ్ల్యూసీలో చర్చించిన కాంగ్రెస్ పెద్దలు శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని భావించినట్టు సమాచారం. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వంలో భాగం చేసి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనే చర్చలు కూడా జరుగుతున్నాయి.