అన్నా రఘు, న్యూస్ 18 అమరావతి ప్రతినిది.. మొన్నటి వరకు మిత్రులుగా మెలిగిన కేంద్రం ప్రభుత్వం - ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది. మొన్నటి వరకు కేంద్రం ఏం చెప్పినా ఎస్ బాస్ అన్నట్టు ఉన్న ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు స్వరం మార్చింది. ప్రస్తుతం రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. మొన్నటి వరకు బీజేపీని పల్లెత్తు మాట అనని వైసీపీ ఇప్పుడు బీజేపీనే టార్గెట్ చేస్తోంది. స్వయాన మంత్రులే బీజేపీ తీరును తప్పు పడుతున్నారు. సీఎం జగన్ సైతం తన కేబినెట్ భేటీలో బీజేపీ ప్రస్తావన తెచ్చారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది అంటూ మంత్రులు ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని.. జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దై.. జైలుకు వెళ్లే అవకాశం ఉందని కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏపీలో పాలన చేత కాక.. కేంద్రాన్ని తప్పు పట్టి అప్పుడు టీడీపీ అనుసరించిన పాత ఫార్ములానే వైసీపీ అనుసరిస్తోందని బీజేపీ నేతలు బౌన్సర్లు వేస్తున్నారు.. రెండు పార్టీల మధ్య విబేధాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం జగన్ బెయిల్ అంశం హాట్ టాపిక్ అవుతోంది.
2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం అయిన దగ్గర నుంచి జగన్ కేంద్రంతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన దానికంటే ఎక్కువ బలమే ఉండడంతో జగన్ అవసరం కేంద్రానికి లేకుండా పోయింది. దీంతో కేంద్రంతో గొడవ పడడం కంటే.. సఖ్యతతో ఉండి కావాల్సిన పనులు చేయించుకోడమే బెటరని సీఎం జగనే స్వయంగా చెప్పారు. మొన్నటి వరకు అదే ఫార్ములాను కొనసాగించారు కూడా..న్యాయంగా తమకు రావలసిన నిధులు,విభజన హామీలు అమలు,ప్రత్యేక హోదావంటి అనేక అంశాలపై ఇన్నాళ్ళూ అభ్యర్ధనలతోనే సరిపెట్టిన వైసీపీ.. సడెన్ గా ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసింది.
ప్రస్తుత సమావేశాలల్లో వైసీపీ ఎంపీలు రాజ్యసభను స్థంబింపజేశారు. అసలే మిత్రపక్షాలు కొన్ని దూరమౌతుండటం,మమతా బెనర్జీ కొత్తకూటమి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఒత్తిడిలో ఉన్న బీజేపీ పెద్దలపై మరింత ఒత్తిడి పెంచడానికి ఇదే సరైన సమయం అని వైసీపీ నాయకుల ఆలోచన కావచ్చు. ఐతే అటు బీజేపీలో మోడి-షా ల ద్వయం ముందు జగన్ పాచికలు పారకపోగా ఇప్పుడు సమస్య మరింత జఠిలమై కూర్చుంది.జగన్ పై రఘురామ రాజు వేసిన బెయిల్ రద్దు పిటీషన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తోందనే ప్రచారం బాగా జరుగుతోంది.
బీజేపీ జాతీయ నేతలు సైతం జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు అవ్వొచ్చు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాముకూడా మౌనంగా ఉంటే జగన్ కొరకరానికొయ్యగా తయారౌతాడని ముందుగానే కేంద్రం ఆర్ధిక సహాయనిరాకరణ చేసినట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి అప్పులు చేసుకోవడానికి కేంద్రం అనుమతులు నిరాకరించడం సమస్యని మరింత జఠిలం చెసింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దిగజారినా కేంద్ర మాత్రం ఒక్కరూపాయి విదిలించడం లేదని, అమ్మ పెట్టాపె ట్టదు-అడుక్కుతిన్నీయదు అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తుందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.త మ అప్పులగురించి ప్రశ్నిస్తున్న కేంద్రం అప్పులు.. ఇంకా ఎక్కువగానే ఉన్నాయంటూ వైసీపీ ఎదురుదాడిచేయడం మొదలు పెట్టింది. ఇవన్నీ గమనిస్తున్న కేంద్ర పెద్దలు జగన్ న్ని దెబ్బకొట్టాలంటే ఇదే సరైన సమయంగా భావించి ఉండవచ్చు.ఎలాగూ ఆంధ్రరాష్ట్రంలో అనధికారిక ఆర్ధిక అత్యవసర పరిస్థితులు ఉన్నాయి.మరో రెండు మూడు నెలలు మౌనంగా ఉంటే ఎలాగూ జగన్ ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీస్తుంది.అప్పుడు ఆంధ్రాలో పాగావేయటం సులువు అవుతుందని కేంద్ర పెద్దల అంచనా కావచ్చు అంటున్నారు రాజకీయ నిపుణలు. తాజా పరిణామాలు అటు బీజేపీకి మేలు చేస్తాయో,ఇటు జగన్ కు మేలు చేస్తాయో చూడాలి.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.