నువ్వో దేశద్రోహి... సంఘద్రోహి... వెలివేస్తాం... చంద్రబాబుకు పోలీస్ అధికారుల సంఘం ఘాటు లేఖ

‘సూర్యుడిపై ఉమ్మి వేస్తున్నావ్. అది నీ ముఖం మీదే పడుతుంది చూసుకో. గౌతమ్ సవాంగ్ లాంటి గొప్ప డీజీపీ ఉన్నందుకు మేం గర్వపడుతున్నాం.’ అని పోలీస్ అధికారుల సంఘం రాసిన లేఖలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: January 12, 2020, 5:08 PM IST
నువ్వో దేశద్రోహి... సంఘద్రోహి... వెలివేస్తాం... చంద్రబాబుకు పోలీస్ అధికారుల సంఘం ఘాటు లేఖ
చంద్రబాబు నాయుడు, గౌతం సవాంగ్ (File Photo)
  • Share this:
మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటు లేఖ రాసింది. ఏపీ పోలీసులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద చంద్రబాబునాయుడు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ అధికారుల సంఘం చంద్రబాబును తూర్పారబడుతూ ఘాటైన లేఖ రాసింది. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని, అయితే, ప్రభుత్వ పెద్దలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఇటీవల చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో రైతుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎక్కడో ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చారని, మరో రెండేళ్ల తర్వాత ఆయన అక్కడికి వెళ్లిపోతారన్నారు. ఈ వ్యాఖ్యలకు పోలీస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ప్రాంతాలు, కులాలు, మతాలు, రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చంద్రబాబుకు పోలీస్ అధికారుల సంఘం రాసిన లేఖలో వివరాలు..

‘మీరు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ సీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను వీరుడు, ధీరుడు అని పొగిడారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన నువ్వు పోలీస్ శాఖ, డీజీపీపై అవాకులు చవాకులు పేలుతున్నావు. సూర్యుడిపై ఉమ్మి వేస్తున్నావ్. అది నీ ముఖం మీదే పడుతుంది చూసుకో. గౌతమ్ సవాంగ్ లాంటి గొప్ప డీజీపీ ఉన్నందుకు మేం గర్వపడుతున్నాం. ఒక అధికారిని ప్రాంతం వారీగా చూస్తున్నావు. దక్షిణ భారత, ఉత్తర భారత, ఈశాన్యం అనే భేదభావాలు సృష్టిస్తున్నావు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిన్ను దేశద్రోహి అని ఎందుకు అనకూడదు. పోలీస్ శాఖలో కులాల వారీగా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్న నువ్వు సంఘద్రోహివి. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల సీఎం అంటావ్. నీ పాలనలో పోలీస్ శాఖకు ఏం చేశావో దమ్ముంటే ఒక్కటి చెప్పు. నీ భద్రత కోసం విధుల్లో ఉన్న పోలీసులకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని ఘనత నీది. రాష్ట్రపతి నుంచి ఉత్తమ అధికారిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కితాబు అందుకున్నారు. ప్రజలను మోసం చేసి బతుకుతున్న నీకేం తెలుసు ఓ అధికారి విలువ. అవాకులు, చవాకులు మానుకోకపోతే పోలీసులు కూడా నిన్ను వెలివేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.’ అని పోలీస్ అధికారుల సంఘం రాసిన లేఖలో మండిపడింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 12, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading