జగన్‌కు వరుస ఎదురు దెబ్బలు.. ఈ మూడే కారణాలు..?

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఇంటా బయటా తగులుతున్న ఎదురుదెబ్బల వెనుక ఈ రెండు కారణాలు కాకుండా మూడో కారణం కనిపిస్తోంది.

news18-telugu
Updated: August 24, 2019, 6:35 PM IST
జగన్‌కు వరుస ఎదురు దెబ్బలు.. ఈ మూడే కారణాలు..?
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పోలవరం రివర్స్ టెండరింగ్, పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా అమలు, అన్న క్యాంటీన్ల వ్యవహారం, రాజధాని మార్పు, కృష్ణానది వరదలు... ఇలా ఏ అంశం తీసుకున్నా ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఆయా అంశాల్లో ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. అధికారులు, మంత్రులు ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తగిన రీతిలో తీసుకెళ్లలేకపోవడం, అటు సీఎం జగన్ కు కూడా అరకొర సమాచారం ఇస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమగా మారుతోంది. ప్రభుత్వం మాత్రం కాస్త ఆలస్యమైనా తమ విధానాలను ప్రజలు సానుకూలంగానే తీసుకుంటారని భరోసా వ్యక్తం చేస్తోంది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను వైసీపీ తీవ్రంగా విమర్శించేది. అయినా టీడీపీ మాత్రం వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకెళ్లేది. తమ తప్పులను విపక్షం విమర్శించినా వాటిలో సద్విమర్శలను సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లిన టీడీపీ చివరికి అందుకు తగిన ఫలితాన్ని అనుభవించింది. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తాను చేపట్టే ప్రతీ కార్యక్రమానికీ, అమలు చేసే పథకానికీ, తీసుకునే ప్రతీ నిర్ణయానికీ రాజకీయంగా, ఇతరత్రా ఇబ్బందులు లేకుండా ఉండేలా సమగ్రంగా ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సీఎం, మంత్రులకు తగిన సమాచారాన్ని, గణాంకాలను అందించడంతో పాటు మంచి చెడ్డల్ని వివరిస్తూ ఉంటుంది. అలా జరగకపోతేనే విశేషం అవుతుంది. ఒక్కోసారి ప్రభుత్వ యంత్రాంగం చేసిన సూచనలను సీఎం, మంత్రులు పెడచేవిన పెడితే కూడా అది విశేషం అవుతుంది. అంతేకాదు విపరిణామాలకు సైతం దారి తీస్తుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఇంటా బయటా తగులుతున్న ఎదురుదెబ్బల వెనుక ఈ రెండు కారణాలు కాకుండా మూడో కారణం కనిపిస్తోంది. అంతగా పాలనానుభవం లేని ప్రభుత్వానికి అధికార గణం తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం ఈ మూడో కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వంలో అధికార కేంద్రాలు ఎక్కువవడం, ఎవరికి ఏం చెబితే ఏం అవుతుందో అన్న భయం బ్యూరోక్రాట్లను వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వ పెద్దలకు ఓ సూచన చేయాలన్నా, సలహా ఇవ్వాలన్నా అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల మూసివేత వ్యవహారంలో సచివాలయంలో ఉండే అత్యున్నత అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వానికి నివేదించడంలోనూ ఓ వర్గం వాదనే నెగ్గింది. చివరికి అన్న క్యాంటీన్లు మూతపడటం, వాటిపై సాధారణ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడం చకచకా జరిగిపోయాయి.

గత ప్రభుత్వం 86 కోట్ల మేర అక్షయపాత్ర ఫౌండేషన్ కు బాకీ ఉందన్న కారణంతో సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... అప్పటివరకూ అన్న క్యాంటీన్లను మూసివేసింది. గత ప్రభుత్వం అక్రమాలపై విచారణ చేయాలనుకుంటే క్యాంటీన్లను మూసివేయాల్సిన అవసరం లేదు. వాటిని కొనసాగిస్తూనే విచారణ చేసుకోవచ్చు. ఇందులోనూ అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు వచ్చాయి. అంతిమంగా ఐదు రూపాయలకే భోజనం చేసే సాధారణ ప్రజల నోటి దగ్గర కూడు లాగేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి రెండు నెలల విరామం తర్వాత అక్టోబర్ లో వీటిని తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన మరో అంశం మంత్రుల బాధ్యతారాహిత్య
వ్యాఖ్యలు. సీఎం మనసులో ఏముందో తెలుసుకోకుండా ప్రెస్ మీట్లలోనూ, బహిరంగంగానూ అడిగిందే తడవుగా కీలక అంశాల్లో కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా రాజధాని మార్పుపై జరిగిన రచ్చ, ఆ తర్వాత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎత్తేస్తామన్న మంత్రి గౌతంరెడ్డి వ్యాఖ్యలు ఇదే కోవలోకి వస్తాయి. ఇప్పటికే రాజధాని అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తిగా లేదనే ప్రచారం సాగుతోంది. ప్రపంచబ్యాంకుతో పాటు పలు అంతర్జాతీయ సంస్ధలు గతంలో రాజధానికి ఇవ్వజూపిన సాయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఇలాంటి సమయంలో రాజధానిగా అమరావతి ఏమాత్రం తగిన ప్రాంతం కాదంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు జాతీయ స్ధాయిలో కలకలం రేపాయి. చివరికి సహచర మంత్రులు పదేపదే వివరణలు ఇచ్చి పరిస్ధితిని చక్కదిద్దారు. పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటాపై ఓవైపు ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుండడం, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఓ వర్గం, మీడియా అతిగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలోనే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తీసేస్తామంటూ మంత్రి గౌతం రెడ్డి చేసిన ప్రకటన కూడా వివాదాస్పదమైంది. దీనిపైనా పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలోనూ ఇదే పరిస్ధితి. పోలవరంలో భాగమైన జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి స్ధలం చూపించకుండా జాప్యం చేసిన ఏపీ జెన్ కో అధికారులు.. నిర్మాణ సంస్ధ నవయుగ పనులు ఆలస్యం చేస్తుందంటూ నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు సైతం మండిపడింది. మీరు స్ధలం చూపించకుండా నిర్మాణ సంస్ధ పనులు ఎలా చేస్తుందంటూ ప్రశ్నించిన హైకోర్టు... ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసింది. ఈ విషయాన్ని జెన్ కో ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదా, లేదా తీసుకెళ్లినా ప్రభుత్వం విస్మరించి రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చిందా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలోనూ అంతిమంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చివరికి రివర్స్ టెండరింగ్ పై విమర్శలకు సమాధానంగా ఈ వ్యవహారమంతా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కు తెలుసంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం బూమరాంగ్ అయ్యాయి. దీనిపై బీజేపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో సాయిరెడ్డి, సీఎస్ అజయ్ కల్లంతో కలిసి పీఎంవోకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పోలవరం వ్యవహారంలో ప్రధాని, హోంమంత్రిని లాగడంపై మరో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే పరిగణించాల్సిన పరిస్ధితి. ఇలా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఓవైపు, ప్రభుత్వ నిర్ణయాలన్నీ సీఎం అనుమతితోనే సాగుతున్నాయా అన్న మీమాంశ ఓవైపు, పాలనానుభవం లేని ప్రభుత్వాన్ని అధికారులు ఓ ఆట ఆడుకుంటున్నారా అన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>