Home /News /politics /

WHY VALLABHANENI VAMSHI QUIT FROM POLITICS IS THERE ANY STRATEGY BEHIND HIS DECISION MS

రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్‌బై.. తెర వెనుక ఏం జరిగింది?

వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ

Vallabhaneni Vamshi quits from Politics : వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడానికి కేసులే కారణమా..? లేక వైసీపీలో చేరే వ్యూహమా అన్న చర్చ జరుగుతోంది.

    గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి,శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. రేపో మాపో వంశీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పెడుతుండటం.. అధికారులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుండటంతో.. అనుచరులను కాపాడుకునేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వంశీ స్పష్టం చేశారు. అయితే బలమైన ప్రత్యామ్నాయం తన ముందున్నప్పటికీ.. తన మనసు అందుకు ఒప్పుకోని కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.వంశీ రాసిన లేఖలో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆ ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే వంశీ బీజేపీ నేత సుజనా చౌదరిని కలవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.

    వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడానికి కేసులే కారణమా..? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పెద్ద వివాదంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం.. అదీ నకిలీ పట్టాలు పంపిణీ చేశారంటూ వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి వంశీ అరెస్ట్ అవబోతున్నారన్న
    ప్రచారం కూడా జరుగుతోంది. కేసు నుంచి తప్పించుకోవాలంటే వైసీపీ నేతలను ఢీకొట్టడం కంటే.. సైలెంట్‌గా పక్కకు తప్పుకోవడమే బెటర్ అని వంశీ ఆలోచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి,శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానంటూ చేసిన ప్రకటన మాత్రం వ్యూహాత్మకమే అయి ఉండవచ్చునన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కేసుల వేధింపుల నుంచి బయటపడేందుకు.. ఆయన ఈ వ్యూహాన్ని అనుసరించినట్టు చర్చ జరుగుతోంది.

    ఇదిలా ఉంటే, వంశీ వైసీపీలో చేరే వ్యూహం కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే ఆయన సీఎం జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి వెంకట్రావు వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా వంశీతో రాజీనామా చేయించారన్న
    ప్రచారం జరుగుతోంది. వంశీ-వెంకట్రావు వర్గాల మధ్య గొడవలు సద్దమణిగేలా చేసి.. ఆ తర్వాత వంశీని వైసీపీలో చేర్చుకుంటారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులన్ని కాస్త గందరగోళంగా కనిపిస్తున్నా.. మరికొద్ది రోజుల్లో
    వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Chandrababu naidu, Gannavaram, Vallabhaneni Vamshi, Ysrcp

    తదుపరి వార్తలు