WHY THIS ANDHRA VILLAGE IN KURNOOL DISTRICT BOYCOTTING LOCAL BODY ELECTIONS HERE IS THE REASON HSN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు మాకొద్దు.. బహిష్కరిస్తున్నాం.. దండోరా వేయించిన గ్రామస్తులు
ప్రతీకాత్మక చిత్రం
’పంచాయతీ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. మా ఊళ్లో ఎన్నికలు పెట్టొద్దు. మా కష్టాలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోవడం లేదు. అందుకే మేం ఎవరికీ ఓటు వెయ్యం‘ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఓ గ్రామం ఏకంగా దండోరా వేయించింది. ఇంతకీ అసలు కారణమేంటంటే..
’మాకు ఈ ఎన్నికలు వద్దు. పంచాయతీ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. మా ఊళ్లో ఎన్నికలు పెట్టొద్దు. మా కష్టాలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోవడం లేదు. అందుకే మేం ఎవరికీ ఓటు వెయ్యం. గ్రామ ప్రజలంతా తీర్మానం చేసుకున్నాం..‘ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఓ గ్రామం ఏకంగా దండోరా వేయించింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ఊరంతా చాటింపు వేయించింది. కర్నూలుమండలం పరిధిలోకి వచ్చే వూడూరు గ్రామంలో ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఏపీ పంచాయతీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. తమ గ్రామం నుంచి ఎవరూ నామినేషన్లు వేయకూడదని ఆదివారం పెద్దమనుషులంతా సమావేశమై నిర్ణయించారు. పాతికేళ్లుగా పీడిస్తున్న ఓ సమస్యకు ఇంత వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పరిష్కారం చూపలేదని, అందుకే తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. ఇంతకీ వారి సమస్య ఏంటంటే..
కర్నూలు జిల్లా వెంకాయ పాలెం క్రాస్ రోడ్ వద్ద నుంచి పడిదెంపాడు మీదుగా వూడూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉంది. పాతికేళ్లుగా ఆ రోడ్డు బాగోగులను పట్టించుకున్న వారే లేరు. ఎన్నిసార్లు ఎందరిని వేడుకున్నా, గ్రామస్తులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. తాజాగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో మరోసారి ఈ రోడ్డు గురించి గ్రామస్తులు సమావేశమయ్యారు. మంగళవారం నుంచి గ్రామంలో నామినేషన్ల ప్రక్రియ జరగబోతోంది. దీంతో నామినేషన్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనవద్దనీ, ఎన్నికలను బహిష్కరిద్దామంటూ గ్రామస్తులంతా తీర్మానం చేశారు. ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల తొలిప్రసవానికి పుట్టింటికి ఆడబిడ్డలు రాలేకపోతున్నారు. ఈ దారిలో ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యంలోనే నలుగురు ప్రసవించారు. ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు మరణించారు. అయినప్పటికీ ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. అత్యధిక పంచాయతీలను తమ మద్దతుదారుల ఖాతాలో పడాలని వైసీపీ ప్లాన్ చేస్తోంటే, అటు టీడీపీ కూడా ధీటుగానే ప్రయత్నాలు చేస్తోంది. వీలయినన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకుని అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని నిరూపించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామాల్లో జరుగుతున్న రాజకీయాల్లో వింత విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట జనసేన, వైసీపీ అనుచరులు కలిసిపోగా, మరోచోట టీడీపీ, వైసీపీ మద్ధతుదారులు కూటమిగా ఏర్పడి, జనసేన-బీజేపీ అనుచరులపై పోటీ చేస్తున్నారు.