ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా.. బద్ధశత్రువైన కాంగ్రెస్‌తోనూ జతకట్టారు. ఆయన తలపెట్టిన ఈ ప్రయత్నానికి మిగితా ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నా.. ఆచరణలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
దేశరాజకీయాల్లో ఒకప్పుడు టీడీపీ చక్రం తిప్పింది. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయపార్టీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించింది. అది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. కేంద్రంలో చాలారోజులకు ఏక పార్టీ ఆధిపత్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. జాతీయస్థాయిలో కమలం పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సహకారం అవసరమని భావించారాయన. అందుకే సిద్ధాంతపరంగా బద్ధవ్యతిరేకి అయినా ఆ పార్టీతో చేతులు కలిపారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబును తమకు అవసరమైన వ్యక్తిగానే భావిస్తోంది. ఎన్నికల సమయానికి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చాలంటే బాబు సహకారం ముఖ్యమనే నిర్ణయానికి వచ్చింది. అందుకే ఆయన అడగ్గానే స్నేహహస్తం అందించింది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగని అవన్నీ కాంగ్రెస్‌ను సమర్థించేవి కావు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచే బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు అస్సలు ఇష్టపడవు. అలాంటి పార్టీలతో మాట్లాడి ఒప్పించాలంటే చంద్రబాబు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చడం వీలవుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లను ఈ కూటమిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సహకారం చాలా ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇప్పటికే చంద్రబాబు పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలిశారు. మాజీప్రధాని దేవేగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాలను కలిసి యాంటీ బీజేపీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారు. వీరితో పాటు పలువురు జాతీయనేతలనూ కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే వీళ్లందరూ అప్పటికప్పుడు తమ మద్దతు తెలిపినా.. ఆచరణలో మాత్రం ఆచితూచి వ్యహరిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీల కలయిక ఆసక్తికరమైన విషయమే అయినా.. వారి కూటమిలో చేరిపోయేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలు అంత ఆత్రత ప్రదర్శించడం లేదని తెలుస్తోంది. అందుకే త్వరలోనే జరగాల్సిన యాంటీ బీజేపీ కూటమి సమావేశం వాయిదాపడింది. అయితే దీనికి, ప్రస్తుతం జరుగుతున్న ఐదురాష్ట్రాల ఎన్నికలు కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా పార్టీల నేతలందరూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఈ సమావేశానికి రావడం కుదరదని చెప్పారట. అందుకే, ఆయా పార్టీలు ఎన్నికల ఫలితాల ఆధారంగానే.. ఒక నిర్ణయం తీసుకోవాలని ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
అయితే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించే ఫలితాలమీదే.. నాన్ బీజేపీ కూటమి మనుగడ ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ సత్తాచూపితేనే .. మిగతా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడే, వాయిదాపడిన మీటింగ్ ఎప్పుడు ఉంటుందనే విషయం తేలుతుంది. లేదంటే అంతేసంగతులు అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
Published by:Santhosh Kumar Pyata
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.