Home /News /politics /

WHY THE EX MP PONGULETI SRINIVAS REDDT MET AP CM YS JAGAN VRY KMM

Khammam : సీఎం జగన్‌ను కలిసిన పొంగులేటి.. ఏమిటి మర్మం..? ఎందుకీ పరిస్థితి..?

పోంగులేటి శ్రీనివాస రెడ్డి ఫైల్ ఫోటో

పోంగులేటి శ్రీనివాస రెడ్డి ఫైల్ ఫోటో

Khammam : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సౌమ్యునిగా పేరు సంపాదించిన ఈ నేత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు తాజాగా చర్చల్లోకి వచ్చింది. ఆయన గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇంకా చదవండి ...
  (జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా )

  చాలాకాలం తర్వాత ఏపీ సీఎం, వైఎస్సారీసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందన్న దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. గత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించిన పొంగులేటి, తనతో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సైతం గెలిపించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనంతరం, రాష్ట్రం ఏర్పాటు అయ్యాక జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైన అంశంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్నారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ప్రత్యేక రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తనతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ సహా తెరాసలో విలీనం చేశారు.

  తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా మారారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయ శక్తిగా మారారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మరోమారు తిరుగులేని స్థాయిలో అధికారాన్ని దక్కించుకున్న తెరాస, ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక్క సీటుతో చతికిలపడింది. కేవలం తమ పార్టీ నేతల మధ్య ఉన్న వైరుధ్యాల వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందన్న ఆగ్రహం అప్పటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఉన్నట్టు చెబుతారు. అందుకే సిట్టింగ్‌ అయిన ఖమ్మం ఎంపీ టికెట్‌ను పొంగులేటికి కేటాయించలేదని పార్టీలో చర్చ.

  Karimanagr : అక్కడ జరిగే ముస్లిం వర్గం పెళ్లిలో ఆంక్షలు.. సంచలనంగా మారిన నిర్ణయం

  పార్టీ అధినేత మొండిచేయి చూపించినా, అనేక అవమానాలు ఎదురవుతున్నా, పార్టీనే అంటిపెట్టుకుని ప్రజల్లో ఇప్పటికీ కలియ తిరుగుతున్న పొంగులేటికి మధ్యలో రాజ్యసభ టికెట్‌ ఇస్తారని.. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పిస్తారని.. ఇంకా అనేక రకాల ఆశలు నిరాశల మధ్య మూడేళ్లు గడిచిపోయింది. అయినా ఇంకా ఒక క్లారిటీ లేకుండా భవిష్యత్తు ఎలా అన్న దానిపై పొంగులేటి వర్గంలో అంతర్మథనం జరుగుతోంది. తెరాస టికెట్‌ను నిరాకరించిన సందర్భంలోనే తమ పార్టీ తరపున పోటీకి సిద్ధమైతే తాము ఓకే అన్న సంకేతాలను ఇటు కాంగ్రెస్‌ పార్టీ, అటు భాజపా నేతలు పంపినా పొంగులేటి స్పందించలేదు.

  తాను ఒక కార్యకర్తగానే తెరాసలో కొనసాగుతానని, తన రాజకీయ భవిష్యత్తును తమ అధినేత కేసీఆర్‌ చూసుకుంటారని పలు సందర్భాలలో పొంగులేటి పేర్కొంటూ వచ్చారు. అయినా మూడేళ్లయినా తెరాస అధినాయకత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడం, ఒకవైపు నమ్ముకున్న క్యాడర్‌, అభిమానుల నుంచి వస్తున్న తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొంటునే వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీ టికెట్‌ ఇస్తారన్న ఆశలు ఉన్నా, ఎలాంటి భరోసా దొరకని పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడినా ఎక్కడా ఖాళీ లేని పరిస్థితి.

  Adilabad : మీరు దివ్యాంగులా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అయితే స్టోరీ చదవండి..

  నేరుగా పోటీ చేయడానికి అవకాశం దొరుకుతుందన్న ఆశలే తప్ప నమ్మకం దొరకని పరిస్థితుల్లో ఏదైనా పార్టీ నుంచి పోటీ చేయాలన్నా సరైన సమయంలోనే   సరైన నిర్ణయం తీసుకుంటారన్న చర్చ కూడా ఉంది. ఇలా జిల్లాలో మరికొంతమంది నేతల పరిస్థితి కూడా ఉండడం యాధృచ్ఛికమే అయినా కాదనలేని నిజం. ఇలానే ఉంటే రాజకీయంగా ఫేడ్‌ అవుట్‌ అయ్యే దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే పొంగులేటి తనకు సన్నిహితుడైన ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారన్న చర్చ ఉంది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఎలాంటి అంశాల్లో చర్చలు జరిగాయి..? ఏఏ విషయాల్లో ఏవిధమైన కంక్లూషన్‌కు వచ్చారన్న అంశాలు కాన్ఫిడిన్షియాల్గానే ఉన్నా.. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్ల చెరగని ఆదరణ ఉన్న ప్రాంతాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లాను వేదికగా చేసుకుని తమ బలాన్ని నిరూపణ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు.

  ఒకవేళ ఒక రాజకీయ ప్రయత్నం ద్వారా తెలంగాణలోనూ తమ ఉనికిని చాటుకోవాలన్న ఆలోచన వైసీపీ అధినాయకత్వం చేసే పరిస్థతి ఇప్పుడు ఉంటుందా అంటే ఇప్పటికిప్పుడు అవును అనలేని కాదు అనలేని పరిస్థితులున్నాయి. అయితే పొంగులేటి లాంటి ప్రజానేత ఓ ప్రయత్నం ద్వారా కొంతమేర ఫలితాలు రాబట్టినా పక్క రాష్ట్రంలోనూ ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశాన్ని వైసీపీ నాయకత్వం వదులుకుంటుందా అన్నదే ప్రశ్న. మొత్యంమీద ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దునే ఉన్న, రాజకీయ, వ్యాపార, సంబంధ బాంధవ్యాలు ఉన్న జిల్లా కావడంతో ఏదీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఏంజరుగుతుందో భవిష్యత్తు నిర్ణయించాలి.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు