ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ నో చెప్పడం వెనుక కారణం ఇదేనా?

TS RTC Strike | ఏపీలో జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే.. ఇక కేసీఆర్ ప్రత్యేక ఏముంటుందనే అభిప్రాయం కూడా టీఆర్ఎస్ వర్గాల్లో సహజంగానే ఉంటుంది.

news18-telugu
Updated: October 8, 2019, 2:03 PM IST
ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ నో చెప్పడం వెనుక కారణం ఇదేనా?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె ఉధృతంగా మారుతోంది. నాలుగో రోజు కూడా సమ్మెలోనే ఉన్నారు ఉద్యోగులు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేవు. అటు ఉద్యోగులు వెనుకడుగు వేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సమ్మెను చూసిన వారిలో రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులో మొదటిది ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు తెలంగాణలో మాత్రం కేసీఆర్‌కు వచ్చిన సమస్య ఏంటి?. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలకు అంతులేకుండా పోతోందనేది మరో వాదన.

మొదటి అంశాన్ని విశ్లేషిస్తే.. అసలు కేసీఆర్ ఎందుకు ఆర్టీసీ విషయంలో అంత కఠినంగా ఉన్నారు? 48వేల మంది ఉద్యోగులను తీసేశాం పోండి అనేంత నిర్దయగా ఎందుకు మారారు? ఆర్టీసీ ఉద్యోగులకు భారీగానే వేతనాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన వసతులు, సౌకర్యాలు అందిస్తోంది ప్రభుత్వం. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదు కాబట్టి, అది చేయడం సాధ్యం కాదనేది టీఆర్ఎస్ వాదన. ఒకవేళ ఆర్టీసీ ఉద్యోగులకు తలొగ్గితే, రేపు మిగిలిన సంస్థల్లోని ఉద్యోగులు కూడా ఇలాగే, మెడ మీద కత్తిపెట్టి డిమాండ్లు సాధించుకుంటారనే అభిప్రాయం కూడా ప్రభుత్వంలో ఉంది.

కేసీఆర్ ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. ‘కుక్క తోకని ఊపాలి కానీ, తోక కుక్కని ఊపకూడదు.’ అని అన్నారు. ఉద్యోగులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యం. అంటే, ప్రభుత్వం చెప్పినట్టు ఉద్యోగులు నడుచుకోవాలి కానీ, ఉద్యోగులు చెప్పినట్టు ప్రభుత్వం నడవదని ఆయన కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు చెప్పినట్టు తలూపితే, రేపు రెవిన్యూ ఉద్యోగులు కూడా ఇలాగే ధర్నాలు, సమ్మెలు చేస్తారనే ముందస్తు ఆలోచనలో భాగంగానే కేసీఆర్ మొండిపట్టుదలతో ఉన్నారు. త్వరలో కీలక సంస్కరణలతో కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఆ సంస్కరణలను ముందుగానే ఊహించిన రెవిన్యూ ఉద్యోగులు అప్పుడప్పుడు తమ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు లొంగితే, భవిష్యత్తులో రెవిన్యూ ఉద్యోగుల విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే.. ఇక కేసీఆర్ ఐడెంటిటీ ఏముంటుందనే అభిప్రాయం కూడా టీఆర్ఎస్ వర్గాల్లో సహజంగానే ఉంటుంది. జూనియర్ అయిన జగన్.. తనను చూసి కాపీ కొట్టాలి కానీ, జగన్‌ను చూసి కేసీఆర్ కాపీ కొట్టారనే అభిప్రాయం ప్రజల్లో రావొద్దనే కృతనిశ్చయంతో తెలంగాణ సీఎం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆర్టీసీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading