Home /News /politics /

పోలవరంలో జగన్‌కు ‘రివర్స్’ కొడుతుందా?

పోలవరంలో జగన్‌కు ‘రివర్స్’ కొడుతుందా?

ఏపీ సీఎం జగన్ (File)

ఏపీ సీఎం జగన్ (File)

Polavaram Project | నిర్ణీత కాలంలో పనులు పూర్తిచేయలేదనే కారణంతో నవయుగను ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం కోరడం సమంజసమే అవుతుంది. అయితే కాంట్రాక్టు నుంచి తప్పించిన విధానం, సాంకేతిక కారణాలతో నవయుగ కోర్టును ఆశ్రయించే అవకాశాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో చిక్కులు తప్పేలా లేవు. ప్రాజెక్టు పనుల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై కాంట్రాక్టు సంస్ధ నవయుగ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళితే ఎదురయ్యే సమస్యలను జగన్ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా ? దీని వల్ల ప్రాజక్టు రీ టెండరింగ్ కూడా ఆలస్యం కానుందా ? కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో అధికారం చేపట్టిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో తమ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధకు ఈపీసీ పద్ధతిలో పోలవరం పనులు అప్పగించింది. కానీ అప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్ ట్రాయ్... సగం ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండానే చేతులెత్తేయడంతో మధ్యలో ఓసారి అంచనాలు పెంచారు. అయినా ఫలితం లేకపోవడంతో ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించకుండానే, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని తెరపైకి తెచ్చారు. ట్రాన్స్ ట్రాయ్ తో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నవయుగతో అవగాహన కుదిర్చారు. అయినా ఈపీసీ పద్ధతిలో కేటాయించిన ప్రాజెక్టు పనులను LS ( lumpsum- గంపగుత్తగా) విధానంలో నవయుగకు అప్పగించారు. ఇది నిబంధనలకు విరుద్ధమే అయినా అప్పటి టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఆ తర్వాత ట్రాన్స్ ట్రాయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ప్రాజెక్టు పనుల నుంచి తప్పించారు. అదే సమయంలో తమను తప్పించడంపై ట్రాన్స్ ట్రాయ్ కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో నవయుగ పనులు మొదలుపెట్టేసింది.

  అలా LS విధానంలో పనులు దక్కించుకున్న నవయుగ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మాత్రమే పనులు పూర్తి చేసి బిల్లులు క్లెయిమ్ చేసుకుంది. ఆ తర్వాత పరిస్ధితులను ముందుగా ఊహించిందో ఏమో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పనులు నిలిపేసింది. అంటే నవయుగ కూడా ఆశించినంత మేర పనులు పూర్తి చేయలేదు. సరిగ్గా ఇదే కారణాన్ని సాకుగా చూపుతూ నిపుణుల కమిటీ నివేదిక మేరకు నవయుగ సంస్ధను ప్రాజెక్టు పనుల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నిర్ణీత కాలంలో పనులు పూర్తిచేయలేదనే కారణంతో నవయుగను ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం కోరడం సమంజసమే అవుతుంది. అయితే కాంట్రాక్టు నుంచి తప్పించిన విధానం, సాంకేతిక కారణాలతో నవయుగ కోర్టును ఆశ్రయించే అవకాశాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఒకసారి నవయుగ దీనిపై ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి ప్రాజెక్టు రీ టెండరింగ్ పై తదుపరి నిర్ణయం తీసుకునే విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్.. లోక్ సభలో పరోక్షంగా స్పష్టం చేశారు.

  గత ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ ను ఒప్పించి, తప్పించిన తరహాలోనే ఇప్పుడు జగన్ సర్కారు కూడా నవయుగతో సంప్రదింపులు జరిపి తప్పుకోవాలని కోరవచ్చు. అందుకే సాధ్యమైనంత త్వరగా సెటిల్ మెంట్ చేసుకోవాలని గత నెల 27న జలవనరుల శాఖ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. అయితే నవయుగకు మద్దతుగా ఇప్పటికే టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను బట్టి చూస్తే ఇదంత సులువు కాదని అనిపిస్తోంది. ఒకవేళ నవయుగ సంస్ధ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయిస్తే ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ తో పాటు మళ్లీ పనులు మొదలు కావడంపైనా ప్రతిష్టంభన నెలకొనే ప్రమాదముంది. అలా జరిగితే ఎట్టి పరిస్ధితుల్లోనూ నవంబర్ 1లోపు రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి పోలవరం పనులు ప్రారంభించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరకపోవచ్చు.

  ఇందులో మరో మధ్యేమార్గం కూడా ఉంది. త్వరలో చేపట్టే రివర్స్ టెండరింగ్ లో నవయుగకు మరోసారి అవకాశం కల్పిస్తామని, తక్కువ ధర కోట్ చేస్తే మళ్లీ నవయుగకే అవకాశం ఇస్తామని సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి గత ఒప్పందం నుంచి తప్పుకుని మరోసారి టెండర్లలో నవయుగ పాల్గొనే అవకాశాలూ లేకపోలేదు. అయితే గత ధర కంటే తక్కువ కోట్ చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఇతరులు తక్కువ ధర కోట్ చేస్తే నవయుగ అవకాశం కోల్పోతుంది. రివర్స్ టెండరింగ్ లో మరోసారి తమకు అవకాశం దక్కుతుందని భావిస్తే తప్ప నవయుగ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఆమోదించి సెటిల్ చేసుకోకపోవచ్చు. ఈ చిక్కులను ముందుగా ఊహించే కేంద్రమంత్రి షెకావత్ ఆ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Polavaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు