హోమ్ /వార్తలు /National రాజకీయం /

పోలవరం రివర్స్ టెండరింగ్... నవయుగ మౌనం వెనుక కారణం?

పోలవరం రివర్స్ టెండరింగ్... నవయుగ మౌనం వెనుక కారణం?

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)

నవయుగ సంస్ధ ఆర్బిట్రేషన్ కు వెళ్లకుండా మిన్నకుండిపోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.

“ఫార్చూన్ ఫేవర్స్ ద బ్రేవ్ (సాహసికులకు కాలం కూడా సహకరిస్తుంది) " అనే సామెత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోయేలా ఉంది. పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కేంద్రం వద్దన్నా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకించినా లెక్క చేయకుండా ధైర్యంగా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కారు దూకుడు ముందు కాంట్రాక్టరు నవయుగ కూడా నిలవలేకపోయింది. ప్రాజెక్టు నుంచి తమను అర్ధాంతరంగా తప్పించడంపై ఆర్బిట్రేషన్ కోర్టు కెక్కి న్యాయపోరాటం చేస్తుందని భావించినా... నవయుగ సంస్ధ మాత్రం వెనక్కి తగ్గింది. ఏపీలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దామని దేశమంతా ఎదురు చూస్తున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం జగన్ సర్కారు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అదీ కేంద్రంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఓ జాతీయ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కోట్లాది రూపాయలు అధికంగా కోట్ చేసి పనులు నత్తనడకన సాగిస్తున్నట్లు గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. రివర్స్ టెండరింగ్ జాబితాలో తొలి ప్రాజెక్టుగా పోలవరాన్ని చేర్చింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నానాటికీ ఆలస్యమవుతుందని, నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో తాజాగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం అదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది. అయినా ఈ విషయంలో వెనక్కి తగ్గరాదని జగన్ సర్కారు నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ విషయంలో తనపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయని స్వయంగా సీఎం జగన్ సైతం తన కేబినెట్ మంత్రులతో వ్యాఖ్యానించారు. ఒత్తిళ్లు ఉన్నాయన్న కారణంతో వెనక్కి తగ్గితే కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యథా అవుతుందని ఆయన పేర్కొన్నారు. అనుకున్నట్లుగానే పోలవరం పనుల్లో జరిగిన అవకతవకలపై నిపుణుల కమిటీని నియమించడం, వాటిని నిర్ధారించడం, కమిటీ సూచనల మేరకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. వచ్చే నెల 19 లోగా టెండర్ల దాఖలుకు గడువిచ్చిన ప్రభుత్వం పాత కాంట్రాక్టరు నవయుగ ఇంజనీరింగ్ కు సైతం అవకాశం కల్పించింది. దీంతో టెండర్ల ప్రక్రియలో ఎలాంటి వివక్షకు తావు లేదని స్పష్టం చేసినట్లయింది.

అయితే ఈ మొత్తం తతంగం సాఫీగా జరిగిపోవడానికి గల కారణాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పగానే షాక్ తిన్న నవయుగ ఇంజనీరింగ్ సంస్ధ తమను ప్రాజెక్టు పనుల నుంచి అర్ధారంతరంగా తప్పించడంపై ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్తుందని అంతా భావించారు. టీడీపీ అధినేత సహా పార్టీలోని పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన నవయుగ సంస్ధ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ ఆర్బిట్రేషన్ కు సిద్ధపడుతుందని అనుకున్నారు. కేంద్రం ప్రకటనలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారుల వ్యాఖ్యల బట్టి చూసినా రివర్స్ టెండరింగ్ అసాధ్యం అని అంతా ఊహించారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ధైర్యంగా వేసిన ముందడుగే అన్న వాదన వినిపిస్తోంది.

నవయుగ సంస్ధ ఆర్బిట్రేషన్ కు వెళ్లకుండా మిన్నకుండిపోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి టీడీపీ సర్కారు ముందుగా ఈపీసీ విధానంలో ఆ పార్టీ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కు కట్టబెట్టింది. రెండేళ్లు పూర్తయ్యాక ట్రాన్స్ ట్రాయ్ దివాలా తీయడం, పనులు కొనసాగించే పరిస్దితి లేకపోవడంతో టీడీపీ సర్కారు.. నవయుగను తెరపైకి తెచ్చి ఎల్.ఎస్. విధానంలో కాంట్రాక్టు పనులు అప్పగించింది. ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి తో పాటు నవయుగ సంస్ధ కూడా తమ పార్టీకి సన్నిహితంగా ఉండటం వల్ల నిబంధలను పక్కనబెట్టి వీరిద్దరికీ సర్దుబాటు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారమే నవయుగ సంస్ధ జగన్ ప్రభుత్వం తొలగించడంపై ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లకుండా ఆపిందనే వాదన వినిపిస్తోంది. ఓసారి న్యాయపోరాటానికి సిద్ధమైతే లొసులులన్నీ బయటికొస్తాయి. అప్పుడు నవయుగకు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అదే కోర్టుకు వెళ్లకుండా రివర్స్ టెండరింగ్ కు పాల్గొంటే తక్కువ ధర కోట్ చేస్తే చాలు. మరోసారి కాంట్రాక్టు దక్కించుకోవచ్చు. దీంతో నవయుగ మరోసారి టెండర్లలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Polavaram

ఉత్తమ కథలు