Andhra Pradesh : ఓవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు జరుగుతున్న టైంలో... సంక్రాంతి తర్వాత అమరావతికి అనుకూలంగా కార్యాచరణ చేపట్టాలని బీజేపీ నిర్ణయించుకున్న సమయంలో... అదే అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతున్న తరుణంలో... ఢిల్లీ నుంచీ పవన్ కళ్యాణ్‌కి పిలుపు వచ్చింది. ఆయన్ని ఎవరు ఢిల్లీకి పిలిచారన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. ఆయన రాజకీయ కారణాలతో ఢిల్లీకి వెళ్లారా లేక వ్యక్తిగత అంశాలపై ఢిల్లీ వెళ్లారా అన్నది తేలాల్సి ఉంది. ఐతే... అమరావతి విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని మొన్ననే పవన్ కళ్యాణ్ అన్నారు. అదే సమయంలో ఈ పిలుపు రావడంతో... ఆయన్ను ఢిల్లీ బీజేపీ పెద్దలే పిలిచారన్న చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ నామమాత్రపు పార్టీయే. ఐతే... పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ పెద్దలకు మొదటి నుంచీ పాజిటివ్ ఫీల్ ఉంది. దానికి తోడు రాజధాని అమరావతి రైతులకు అనుకూలంగా పవన్ ఉండటంతో... ఆయన్ని కూడా కలుపుకొని... బీజేపీ తన కార్యాచరణ సాగిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీలో జనసేనను బలపరచడం ద్వారా... బీజేపీ ఓ కూటమిగా బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తమకు అనుకూలంగా ఉండే పార్టీలతో జట్టు కట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ రెండుసార్లు ఢిల్లీ టూర్‌కి వెళ్లారు. ఇప్పుడు మూడోసారి కూడా వెళ్లడంతో... రాజకీయంగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మొదటి నుంచీ వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ అంటే... వ్యతిరేకంగానే ఉన్నారు పవన్ కళ్యాణ్. గతంలో టీడీపీతో జట్టుకట్టినప్పుడు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో... కాస్త సైలెంటైన పవన్ కళ్యాణ్... ఇప్పుడు రాజధాని అమరావతి అంశంలో మరోసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో ఆయన... ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటూ కొందరు ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందో జగన్ చెప్పాలంటున్న పవన్ కళ్యాణ్... ఢిల్లీ నుంచీ వచ్చాక... తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సంక్రాంతి తర్వాత సమ్మర్ ఎండలతోపాటూ... ఏపీ రాజకీయాలు కూడా మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan