WHY BJP SELECT EX IAS RATHNA PRABHA IN TIRUPATI BY POLL MP CANDIDATE NGS BK
tirupathi by poll: తిరుపతి బై పోల్ లో కాషాయ వ్యూహం ఏంటి? రత్న ప్రభ ఎన్నిక వెనుక అంత కథ ఉందా?
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి ఉప ఎన్నికలో ఇప్పుడు అందరి ఫోకస్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై పడింది. ఎంతోమందిని కాదని ఆమెకు ఎందుకు సీటు ఇచ్చారన్నది హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలో రాజకీయ అనుభవం లేని ఆమెకు సీటు ఇవ్వడం వెనుక కారణాలేంటి అన్నది ఆసక్తికరంగా మారింది.
సుదీర్ఘ చర్చలు.. తీవ్ర వడపోతలు.. జనసేన అభిప్రాయ సేకరణ.. ఇలా తిరుపతి బై పోల్ అభ్యర్థి ఎంపిక చేయడానికి బీజేపీ పెద్ద కసరత్తే చేసింది. అయితే అందరినీ కాదని రత్నప్రభకు బీజేపీ పెద్దలు ఎందుకు ఓటేశారు? ఆమెనే బరిలోకి దింపాలి అనుకోవడానికి కారణమేంటి?
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బిజేపీ తన పార్టీ అభ్యర్ధి పేరును ఖరారు చేసిన తరువాత అందరిలో మొదలైన అనుమానాలు ఇవే. రిటైర్డ్ ఐఏఏస్ ఆఫీసర్ రత్నప్రభ కు టిక్కెట్ ఇస్తోన్నట్లు గురువారం పార్టీ కేంద్ర కార్యలయం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రత్న ప్రభ ఎవరు అనే చర్చ ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు ప్రజల్లోను నెలకొంది.
1981 ఏపీ కేడర్ కు చెందిన ఐఎఎస్ ఆఫీసర్ 2018 లో రిటైర్ అయ్యారు. తరువాత 2019లో కాషాయ కండువా కప్పుకున్నారు రత్న ప్రభ. అంతకు ముందు 2017లో తొలిసారి కర్ణాట్నక మహిళ సిఎస్ గా నియమితులయ్యారు. 1983 ఆమె తొలిసారి బీదర్ కు అసిస్టెంట్ కమీషనర్ గా నియమితులైయ్యారు. అప్పటినుంచి దాదాపు 37 ఏళ్లు సుదీర్ఘంగా వివిధ విభాగాల్లో పని చేశారు. 2018 లో రిటైర్ అయ్యారు. రత్నప్రభ తండ్రి చంద్రయ్య, భర్త విద్యాసాగర్ కూడా ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులే.
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ గెలుపు గురించి కాకుండా మెజార్టీ గురించి ఆలోచిస్తోంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం ఎలాగైన తమ ఉనికి కాపాడుకోవాలని ఆరాట పడుతోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తూ దూకుడుగా ఉంది. ఇక పొత్తులో భాగంగా సీట్ ను జనసేనకు కేటాయించి ఉంటే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చేవని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో.. బీజేపీ, తమ మిత్రపక్షం జనసేనను ఒప్పించి బరిలోకి దిగింది. అయితే ఈ నిర్ణయం తమకు కలిసి వస్తుంది అంటోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. జనసేన ఉంటే ఓట్లు చీలేవని.. ఇప్పుడు జనసేన బరిలో లేకపోవడంతో తమ నెత్తిన పాలు పోసినట్టే అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు.
ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం తీవ్రమైంది. రాష్ట్రంలో రాజకీయ పక్షాలు అన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాయి. మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుపతి కార్పొరేషన్ లో బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలతో పెద్దగా పరిచయం లేని మాజీ ఐ.ఎ.ఎస్ రత్నప్రభను బరిలో దింపి అందర్నీ ఆశ్చర్యపరిచింది బీజేపీ. అయితే ఆమెను బరిలో దింపడానికి బలమైన కారణమే ఉందంటున్నారు విశ్లేషకులు. రత్నప్రభ కర్ణాటక ప్రాంతంలో మంచి పాపులర్ ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ అని. దీంతో పాటు ఏపీలో కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉందని.. నిజాయతీ.. తెగువ ఉన్న అధికారిగా గుర్తింపు పొందారని.. అందుకే ఆమెను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. దీంతో పాటు గతంలోపార్టీలోకి వచ్చే ముందే కేంద్ర బిజేపీ పెద్దల నుంచి రత్న ప్రభుకు స్పష్టమైన హామి ఉన్నట్లు సమాచారం, పార్టీలోకి వచ్చిన తరువాత సరైన సమయంలో న్యాయం చేస్తామని మోదీ ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె ఏపీ పొలిటికల్ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.