సీఎం జగన్‌ను బొత్స టార్గెట్ చేస్తున్నారా? వ్యూహం అదేనా?

Andhra Pradesh | Botsa Politics : ఏపీ రాజకీయాల్లో తనదైన ప్రకటనలతో దుమారం రేపుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ఐతే... సీఎం జగన్‌ను టార్గెట్ చేసే ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: February 16, 2020, 6:43 AM IST
సీఎం జగన్‌ను బొత్స టార్గెట్ చేస్తున్నారా? వ్యూహం అదేనా?
Target Jagan : సీఎం జగన్‌ను బొత్స టార్గెట్ చేస్తున్నారా? వ్యూహం అదేనా?
  • Share this:
Andhra Pradesh | Botsa Politics : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఢిల్లీ పర్యటనతో... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. ఏంటంటే... బీజేపీతో వైసీపీ జట్టు కట్టబోతోందనీ, కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరబోతోందనీ, రెండు మంత్రి పదవులు దక్కబోతున్నాయని. ఇది పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై టీడీపీ, వైసీపీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తమ పార్టీని కొన్ని వర్గాల నుంచీ దూరం చేయాలనే కుట్రతో టీడీపీ కావాలని ఇలాంటి ప్రచారం చేస్తోందనీ వైసీపీ నేతలూ... ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై పోరాడటం మానేసి... బీజేపీతో పొత్తుకు వైసీపీ ఆరాటపడుతోందని టీడీపీ నేతలూ భగ్గుమంటున్నారు. ఐతే... అసలీ దుమారం రేగడానికి ప్రధాన కారణం మంత్రి బొత్స సత్యనారాయణే అనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే... రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంతకైనా దిగుతుంది అంటూ స్వయంగా బొత్స సత్యనారాయణే స్టేట్‌మెంట్ ఇవ్వడంతో... రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ నిజమే కావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు వైసీపీలో భిన్న స్వరాలకు దారితీస్తున్నాయి. కేంద్రంలో వైసీపీ చేరడంపై సీఎం జగన్ మాత్రమే ప్రకటన చేస్తారు తప్ప... ప్రెస్ మీట్లలోనో, లేక పిచ్చాపాటీగానో ఎవరైనా ఏదైనా చెబితే దాన్నే పార్టీ వైఖరిగా భావించరాదని మంత్రి కొడాలి నాని చెప్పడం పార్టీలో భిన్న స్వరానికి నిదర్శనంగా మారింది. దీంతో ఇది బొత్స అభిప్రాయమా లేక పార్టీ నిజంగానే బీజేపీతో చేతులు కలపబోతోందా అన్న డౌట్లు ప్రజలకు కలుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర వర్గాలు మాత్రం ఏ పొత్తూ లేదనీ... అసలు వైసీపీతో తాము కలిసే ప్రసక్తే ఉండదని అంటున్నాయి. అదే నిజం అని మనం అనుకుంటే... పొత్తు ఉండదు అన్నదే రైట్ అనుకుంటే... మరి బొత్స ఎందుకిలా అన్నారన్నది తేలాల్సిన అంశం.

ఇదివరకు ఏపీ రాజధాని (మూడు రాజధానులు లేదా రాజధాని తరలింపు లేదా విశాఖ పరిపాలనా రాజధాని) అంశంపై మొదట మాట్లాడింది, మీడియాకు లీక్ ఇచ్చింది మంత్రి బొత్స సత్యనారాయణే. అప్పట్లో ఆయన వరుసగా రెండుసార్లు ఈ అంశంపై మాట్లాడి... అంతా దీనిపై చర్చించుకునేలా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణే... బీజేపీ, వైసీపీ పొత్తులపై లీక్స్ ఇస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పినదే నిజమైంది కాబట్టి ఇప్పుడు కూడా బొత్స అన్నదే నిజం కాబోతోందా అన్న డౌట్లు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

ఒకవేళ బొత్స అన్నది ఆయన సొంత అభిప్రాయం అనుకుంటే... ఆయన అలా ఎందుకు అన్నారన్నది తేలాల్సిన అంశం. అత్యంత కీలకమైన, పార్టీ విధాన నిర్ణయాల విషయంలో బొత్స తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారా? అధినేత జగన్ అభిప్రాయం తెలుసుకోకుండా అలాంటి కామెంట్లు చేసేస్తారా అన్నది అందరిలోనూ ఎదురవుతున్న ప్రశ్న. అదే నిజమైతే... ఇది బొత్స సొంత అభిప్రాయమే అయితే... సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. పార్టీలో పట్టు పెంచుకోవడానికి, జగన్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా మారేందుకు బొత్స ప్రయత్నిస్తున్నారనీ, ఉత్తరాంధ్రకు చెందిన ఆయన... ఇప్పటికే విశాఖకు పరిపాలనా రాజధానిని తెప్పించుకోవడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారనీ, ఇప్పుడు పార్టీలో తన మాటే నెగ్గేలా బీజేపీ, వైసీపీ పొత్తుపైనా సొంత అభిప్రాయం వ్యక్తం చేస్తూ... కలకలం రేకెత్తిస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచీ వస్తోంది. అందుకే మంత్రి నానీ... బొత్స వ్యాఖ్యల్ని పరోక్షంగా ఖండించారని అంటున్నారు. మొత్తానికి బొత్స ఇలా అప్పుడప్పుడూ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీతోపాటూ... రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు