ప్రజావేదిక కూల్చివేత ఎందుకు? చట్టాలు ఏం చెబుతున్నాయి ?

అయితే తాజాగా ప్రజావేదిక కూల్చివేత మొదలు పెట్టడంతో కరకట్ట ప్రాంతంలోని మిగిలిన కట్టడాల విషయంలోనూ హైకోర్టులో వాదనలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తిన్నాయి.

news18-telugu
Updated: June 26, 2019, 8:58 AM IST
ప్రజావేదిక కూల్చివేత ఎందుకు? చట్టాలు ఏం చెబుతున్నాయి ?
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 26, 2019, 8:58 AM IST
ఏపీ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న సాయంత్రం ప్రారంభమైన కూల్చివేత ప్రక్రియ ఇవాళ సాయంత్రం వరకూ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో అసలు కూల్చివేతకు కారణంగా భావిస్తున్న చట్టాలు, వాటి నేపథ్యంపై న్యూస్ 18 విశ్లేషణ ఒకసారి చూద్దాం. మన దేశంలో జలవనరులను పరిరక్షించే ఉద్దేశంతో నదులు, నదీగర్భాలు, వాటి పరివాహక ప్రాంతాల్లో కాంక్రీటు కట్టడాలపై సుప్రీంకోర్టు ఏనాడో నిషేధం విధించింది. 1994లో ఎంసీ మెహతా వర్సెస్ కమల్ నాథ్ కేసులో నదీ గర్భాల్లో కట్టడాలు అక్రమమేనంటూ దేశ అత్యున్నత న్యాయస్ధానం మరోసారి స్పష్టత ఇచ్చింది. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదీ పరివాహక ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన కట్టడాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... నదీగర్భం, పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా బియాస్‌ నదిలో కట్టడాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా గాలి, నీరు, చెట్టు, నదులు, సముద్రాలు ఏ ఒక్కరి సొంతం కాదని, మానవాళి సొంతమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణలో డాక్ట్రిన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రస్ట్‌ థియరీని భారతీయ చట్టాల్లోకి సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. తాజాగా కృష్ణా కరకట్ట ప్రాంతంలోని కట్టడాలకూ ఇదే తీర్పు వర్తిస్తుందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
2016లో విజయవాడకు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో మొత్తం 52 నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసులో 15వ ప్రతివాది ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ నుంచి ఎమ్మెల్యే ఆర్కే, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కౌంటర్ కూడా కోరారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్నేళ్లుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది.

అయితే తాజాగా ప్రజావేదిక కూల్చివేత మొదలు పెట్టడంతో కరకట్ట ప్రాంతంలోని మిగిలిన కట్టడాల విషయంలోనూ హైకోర్టులో వాదనలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తిన్నాయి. అదే జరిగితే ఇప్పటికే కరకట్టపై తమ నిర్మాణాలపై హైకోర్టులో కేసులు వేసి కూల్చివేతలను అడ్డుకున్న స్ధలాల యజమానులకు సైతం ఇబ్బందులు తప్పకపోవచ్చు.ప్రజావేదికను మినహాయిస్తే కరకట్ట ప్రాతంలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలపై ప్రస్తుతం హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇవన్నీ విచారణలో పలు దశల్లో ఉన్నాయి. వీటిపై ముందుకెళితే ప్రజావేదికతో పాటు అప్పటి సీఎం నివాసానికి సైతం ఇబ్బందులు తప్పవని గత ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీటన్నింటిపైనా వరుస కేసులు చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రజావేదిక కూల్చివేత నిలిపేయాలని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ సందర్బంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు శరాఘాతం కానుందని చెప్పవచ్చు.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 , విజయవాడ సీనియర్ కరస్పాండెంట్)
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...