(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 కరస్పాండెంట్,ఖమ్మం)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఖమ్మం లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నిక ఊహించని విధంగా మలుపులు తీసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకచౌదరి బరిలో నిలవగా, తెరాస తరపున మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. ఇక సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్ధిగా బోడ వెంకట్, బీజేపీ నుంచి దేవకి వాసుదేవ్ పోటీపడ్డారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతంగా పేరున్న ఖమ్మంలో ఎవరు గెలుస్తారన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి మిగిలిన రాష్ట్ర రాజకీయాలకు భిన్నమైన ప్రజా తీర్పులు వెలువడే ఖమ్మంలో ఈసారి ఏం జరగనుందో ఓ పట్టాన అంతుపట్టడం లేదు. బీజేపీని మినహాయిస్తే ప్రధాన పోటీదారులు ఇద్దరూ సమర్ధులు కావడం.. రెండు ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆసక్తి పెరిగింది.
గతంతో పోలిస్తే పోలింగ్ శాతం కొద్దిమేర తగ్గినా, తామంటే తామే గెలుస్తామంటూ ఇరు పార్టీలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. వామపక్ష రాజకీయాలకు నిలయమైన ఖమ్మంలో కమ్యూనిస్టు ఉద్యమం రకరకాల కారణాలతో వెనకడుగు వేయడంతో బూర్జువా పార్టీల హవా కొనసాగుతోంది.

(ఎన్నికల ప్రచారంలో నామా నాగేశ్వరరావు )
ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకం.. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన రాష్ట్ర ఫలితాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్, తెదేపా అలయెన్స్ మంచి ఫలితాలను సాధించింది. దీంతో ఖమ్మం ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ స్థానంలో తానే ఇన్చార్జిగా వ్యవహరిస్తూ, ఇక్కడి పనులను పర్యవేక్షించడానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రత్యేకంగా పంపారు. గ్రూపు తగాదాల్లో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించిన కేసీఆర్, ఆఖరి నిమిషంలో తెదేపా నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్కుమార్లపై పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం తమ బృందగానం సరిగా లేకనే ఓటమి పాలయ్యామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేలా, ముందస్తుగానే తుమ్మల, పొంగులేటి, పువ్వాడలకు పదవుల ఆశచూపి.. ఇక్కడి ఫలితమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందన్న స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో ఐక్యతారాగాన్ని ఆలపించిన తెరాస నాయకత్వం గెలుపు దిశగా కృషి చేసింది. లోలోపల ఎలా ఉన్నా సీఎం కేసీఆర్ భయానికి అందరూ ఒకే వేదికను పలుమార్లు పంచుకుంటూ నామా విజయానికి అన్ని వనరులను పుష్కలంగానే వినియోగించారు. సారు.. కారు..పదహారు నినాదంతో, ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యంగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ యోచనకు అనుగుణంగా జిల్లా నాయకత్వం కష్టించింది.
మండల, గ్రామ స్థాయి నాయకత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ గెలుపు దిశగా పనిచేసింది.ఐక్యతారాగం ఫలించేనా.. ఇప్పటికే ఇక్కడి నుంచి మూడుమార్లు ఓటమి చవిచూసిన నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంచుకోవడంలో సీఎం ఆంతర్యం అంతపట్టక జిల్లాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ పెద్దాయన సిఫార్సుతో, భారీ ప్రయోజనం ఆశించి నామాకు టికెట్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది.
( మాజీ మంత్రి తుమ్మల, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్లతో కలిసి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం..)
ఇక ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించడం తెరాస విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లుగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ, సౌమ్యునిగా పేరున్న పొంగులేటి తెరాస అభ్యర్థిగా ఉంటే కనీసం రెండు లక్షలకు పైగా మెజారిటీ వచ్చేదని, రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం. ఐదేళ్లలో అన్ని వర్గాలలోకి దూసుకెళ్లిన పొంగులేటి, చివరకు మరో అభ్యర్థికి ప్రచారం చేయడం జిల్లాలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మొదట్లో కొంత సైలెంట్‌గా ఉన్నా, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడిన అనంతరం పొంగులేటి జిల్లాలో ప్రచారం చేశారు. తనవంతుగా నామా గెలుపునకు కృషిచేశారు. అయితే ఆయన ప్రయత్నం ఏమేరకు ఓటు రూపంలో టర్న్ అవుతుందో చూడాలి.
ఇక నామాకు గతంలో వైరి వర్గాలుగా ఉన్న తుమ్మల, మూడు నెలల క్రితం ఖమ్మంలో నామాపై గెలుపొందిన అజయ్‌కుమార్‌లు కూడా .. మారిన రాజకీయ పరిస్థితుల్లో నామా విజయం కోసం పనిచేయకతప్పలేదు. వీరితో బాటు తెరాస తీర్థం పుచ్చుకున్న సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్‌లు, గత ఎన్నికల్లో ఓటమిపాలైన తెరాస నాయకులు జలగం వెంకటరావు, మదన్‌లాల్, రవి లాంటి వారు నామా విజయానికి కృషి చేసినా.. ఇది ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
ఈ ఎన్నికల ప్రచారంలో పెద్దగా ప్రచారాస్త్రం అంటూ ఏమీ లేకపోవడం, సీఎం కేసీఆర్‌ను చూసి ఓటు అడగడం, సీతారామ ప్రాజెక్టు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు లాంటివాటిని ప్రస్తావించారు.
అయితే తెరాస నేతల చిత్తశుద్ధిపై జిల్లాలో పలుమార్లు విస్త్రతంగా చర్చ జరిగింది. నామాతో గత రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి తుమ్మల, పువ్వాడ అజయ్, పొంగులేటిలు ఏమేరకు పనిచేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న గ్రూపునకు మరో గ్రూపు తోడవుతుందేమోనన్న సంశయం కూడా నేతలను వెంటాడింది. ఏదిఏమైనా మొత్తానికి కేవలం సీఎం భయానికి ఐక్యతారాగాన్ని ఆలపించడం మాత్రం కనిపించింది. ఇక మూణ్నెళ్ల క్రితం నామా ఇక్కడి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో తనకోసం ఖర్చు పెట్టుకున్నవారిని కనీసం పట్టించుకోకపోవడం, కనీసం తిరిగి చూడకపోవడం, పార్టీ మారే సమయంలో మాటమాత్రం సంప్రదించకపోవడం లాంటివి ప్రతికూలాంశాలుగా మారే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో తనను బలపర్చిన కమ్మ సామాజిక వర్గం ఈసారి స్తబ్దుగా ఉండడం, పొంగులేటికి టికెట్ నిరాకరించడంతో రెడ్డి సామాజికవర్గం అసంతృప్తిగా ఉండడం, మైనారిటీలు, ఎస్సీఎస్టీలు కూడా ఆశించిన స్థాయిలో తెరాసను బలపర్చలేదన్న వాదన వినిపిస్తోంది. కేవలం అధికారం, డబ్బు పంపిణీ పైనే ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది.
(ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి..)
గత వైభవం దిశగా రేణుకచౌదరి..
రెండుమార్లు ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన రేణుక కేంద్రమంత్రిగా పనిచేశారు. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఆమె ప్రచారం, గతంలో చేసిన పనులు, అన్ని వర్గాలకు చేరువ కావడానికి ఎంచుకున్న మార్గాలు ఆమెకు అండగా నిలిచాయి. గతంలో పార్టీలోనే ఆమెకు బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ముద్రపడిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఖమ్మం లోక్‌సభ ఇన్ఛార్జిగా బాధ్యతను అప్పగించడం విశేషం. జిల్లాకే చెందిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చివరిదాకా రేణుకకు టికెట్ రాకుండా అడ్డుకున్నా.. ఢిల్లీలో తనకున్న బలంతో ఆమె టికెట్ సాధించారు. సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఈసారి రేణుకచౌదరి ఓట్ల కోసం తాను ఎవరికీ డబ్బు ఇవ్వడంలేదని కూడా ప్రచారం చేయడం విశేషం.
ధనబలం, అధికారమదంతో తెరాస వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌కు ఎదురు నిలిచిన తనకు మద్దతు ఇవ్వాలని రేణుక ప్రచారం చేశారు. తాను ఎన్నికల ట్రెండ్ సెట్ చేస్తానని, తనను బలపర్చాలని కోరారు. ఇది అన్ని వర్గాలను ఆలోచింపజేసింది. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో ఈ తరహా ప్రచారం, ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏడాదికి రూ.72 వేల పథకాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఇంకా డబ్బుకు, అధికారానికి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల తీరును, తెరాస తీరును ప్రజలకు వివరించడంలో రేణుక సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. దీనికితోడు మొదటినుంచి కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉండడం, మైనారిటీలు, ఎస్సీఎస్టీలు అండగా నిలవడం రేణుకకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
గతంలో నామాకు అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోగలగడం, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెరాస నాయకత్వం టికెట్ ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తూ.. రెడ్డి సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేయగలిగారు. గతంతో పోల్చితే కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు పెద్దగా లేకపోవడం, తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు అవమానాలు ఎదుర్కొన్న రేణుక.. తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనంటూ పదేపదే చెప్పుకోవడంతో అప్పట్లో దూరంగా ఉన్న వర్గాలు కూడా ఈసారి ఆమెకు అండగా నిలిచాయి. అదే సమయంలో సీఎల్పీ లీడర్ భట్టి ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, తన ప్రత్యర్థి డబ్బుతో సహా అన్ని వనరులను వినియోగించడం.. తాను మాత్రం కేవలం కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రచారం, తెరాస నిరంకుశత్వంపై మాటల దాడికి ఆమె పరిమితం అయ్యారు. తాను అమ్ముడుపోయానని, బెదిరింపులకు గురయ్యానంటూ తనపై సోషల్‌మీడియాలో జరిగిన ప్రచారం పైనా ఆమె విరుచుకుపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ సంప్రదాయ ఓట్‌బ్యాంకు, తెదేపా సహకారం, తెరాస అసంతృప్తులపైనే రేణుక ఆశలు పెట్టుకున్నారు. మరి ఓటర్లు ఏమేరకు ఆదరిస్తారో.. ఎవరికి పట్టం గడతారో చూడాల్సి ఉంది.