ఖమ్మం కోటాలో మంత్రి అయ్యేదెవరు... ఆ ముగ్గురిలో కేసీఆర్ మొగ్గు ఎవరికి ?

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా సాగినా... ఖమ్మం జిల్లాలో మాత్రం కారు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే ఆ తరువాత ఇతర పార్టీల నుంచి వలసల కారణంగా జిల్లాలో టీఆర్ఎస్ బలం బాగా పెరిగింది.

news18-telugu
Updated: June 15, 2019, 11:32 AM IST
ఖమ్మం కోటాలో మంత్రి అయ్యేదెవరు... ఆ ముగ్గురిలో కేసీఆర్ మొగ్గు ఎవరికి ?
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. కేబినెట్‌లోకి కొత్తగా మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండటంతో... ఈసారి కేబినెట్‌ను కేసీఆర్ పూర్తిస్థాయిలో విస్తరిస్తారనే ప్రచారం జరుగుతోంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... తొలి కేబినెట్ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చోటు కల్పించని గులాబీ బాస్... ఈసారి కచ్చితంగా జిల్లాకు ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయనకు జిల్లా నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా సాగినా... ఖమ్మం జిల్లాలో మాత్రం కారు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. కేవలం ఖమ్మం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ మినహా ఎవరూ టీఆర్ఎస్ నుంచి విజయం సాధించలేకపోయారు. అయితే ఆ తరువాత ఇతర పార్టీల నుంచి వలసల కారణంగా జిల్లాలో టీఆర్ఎస్ బలం బాగా పెరిగింది. కాంగ్రెస్‌ నుంచి పలువురు, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఈసారి కేసీఆర్ ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్‌లోకి ఎవరికి తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం పువ్వాడ అజయ్, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఖమ్మం కోటాలో మంత్రి పదవి దక్కొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తే వనమాకు ఛాన్స్ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ కోటాలో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే సండ్రకు మంత్రి పదవి దక్కొచ్చని సమాచారం. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తే మాత్రం పువ్వాడ అజయ్‌కి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఖమ్మం కోటాలో ఈసారి కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోయేది ఎవరనే అంశంపై సస్పెన్స్ వీడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు