Narendra Modi swearing in Ceremony: నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌లో ‘ఆ నలుగురు’ ఎవరు ?

Narendra Modi new cabinet | తాను ఈ సారి కేబినెట్‌లో ఉండబోనని అరుణ్ జైట్లీ స్వయంగా మోదీకి లేఖ రాయడం ఈ నాలుగు శాఖల కేటాయింపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: May 30, 2019, 6:27 PM IST
Narendra Modi swearing in Ceremony: నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌లో ‘ఆ నలుగురు’ ఎవరు ?
నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 30, 2019, 6:27 PM IST
లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు నరేంద్రమోదీ. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగబోయే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ జాబితాలో బీజేపీ సీనియర్ నేతలతో పాటు కొందరు కొత్తవారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే కేంద్రంలో కీలకంగా చెప్పుకునే హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలు ఈ సారి ఎవరికి దక్కుతాయనే దానిపై ఢిల్లీ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అమిత్ షా కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం కావడంతో... ఆ నాలుగు శాఖల్లో ఆయనకు ఒక శాఖ కన్‌ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది.

మోదీ గత ప్రభుత్వంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి వాళ్లు కీలకమైన నాలుగు శాఖలను నిర్వహించారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య సమస్యల కారణంగా చివర్లో పియూష్ గోయల్ ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఇక మనోహర్ పారికర్ చేపట్టిన రక్షణ శాఖ బాధ్యతలను ఆ తరువాత నిర్మలా సీతారామన్ తీసుకున్నారు. ఈ సారి కేబినెట్‌లోకి రాజ్ నాథ్, సుష్మాస్వరాజ్‌ను తీసుకునే అవకాశం ఉన్నా... వారికి మళ్లీ అవే శాఖలు ఇస్తారా ? లేక మారుస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తాను ఈ సారి కేబినెట్‌లో ఉండబోనని అరుణ్ జైట్లీ స్వయంగా మోదీకి లేఖ రాయడం ఈ నాలుగు శాఖల కేటాయింపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమిత్ షా కేబినెట్‌లో చేరితే ఆయనకు హోం, రక్షణ లేదా ఆర్థిక శాఖల్లో ఏదో ఒక శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో... మిగతా మూడు శాఖలను ఎవరికి కేటాయిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీలో సీనియర్లయిన రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ వంటి వారికి ఈ శాఖలను కేటాయిస్తారా లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మోదీ కేబినెట్ ఎలా ఉండబోతోందనే అంశంతో పాటు టాప్ 4 శాఖలు చేపట్టబోయే ఆ నలుగురు ఎవరనే దానిపై కూడా రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.



First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...