ఆ రెండు మంత్రి పదవులు... జగన్ ఓటు ఎవరికి... వైసీపీలో మొదలైన చర్చ

సీఎం జగన్

త్వరలోనే ఎంపీలుగా మారనున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కేబినెట్‌లోకి ఎవరు వస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Share this:
    ఈ నెల 19న జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు సీట్లు దక్కడం దాదాపు ఖాయమైంది. వారిలో ప్రస్తుతం ఏపీ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. త్వరలోనే ఎంపీలుగా మారనున్న ఈ ఇద్దరి స్థానంలో కేబినెట్‌లోకి ఎవరు వస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల్లో ఈ చర్చ కూడా జరిగినట్టు తెలుస్తోంది. కొందరు మీ స్థానంలో కేబినెట్‌లోకి ఎవరొస్తారని... ఆ ఇద్దరు మంత్రులనే అడిగినట్టు సమాచారం. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీలుగా మారనుండటంతో ఖాళీ కాబోయే స్థానాలను బీసీ వర్గానికి చెందిన వారికే కేటాయించే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

    అలా కాని పక్షంలో బీసీల పదవులు వేరే వాళ్లకి ఇచ్చారనే ప్రచారం జరుగుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన ఏ విధంగా ఉందనే అంశం వైసీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ రెండు మంత్రి పదవులను మోపిదేవి, పిల్లి సామాజిక వర్గాలకు, అదే జిల్లాలకు కేటాయిస్తారా ? లేక ఇందుకు భిన్నంగా కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే కొత్తగా మంత్రి పదవుల విషయంలో సీఎం జగన్ ఎవరికి హామీ ఇవ్వలేదని... కాబట్టి ఆయన మనసులో ఏముందో చెప్పడం కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేసిన తరువాతే... ఈ పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: