గ్రేటర్‌లో టీఆర్ఎస్‌ను ముందుకు నడిపించేది ఎవరు ? ఆ కీలక పదవి దక్కించుకోబోయేది ఎవరు ?

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటోలు)

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బీజేపీ కొంత బలహీనంగా కనిపిస్తున్నా.. గ్రేటర్ పరిధిలో మాత్రం బీజేపీ బలపడుతోందనే విషయాన్ని గతేడాది జరిగిన గ్రేటర్ ఎన్నికలు స్పష్టం చేశాయి.

 • Share this:
  తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్ఎస్.. త్వరలోనే క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని టీఆర్ఎస్.. ఇప్పుడు మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసే దిశగా ఈ కమిటీలు ఉండాలని భావిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వార్డు, జిల్లా స్థాయిలో కమిటీ సంగతి ఎలా ఉన్నా.. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో పార్టీ పగ్గాలను టీఆర్ఎస్ అధినాయకత్వం ఎవరికి అప్పగిస్తుందనే అంశంపై మాత్రం ఆ పార్టీలో ఆసక్తి నెలకొంది. గ్రేటర్ పరిధిలో ఎక్కువ స్థానాలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్‌ను ముందుకు నడిపించే నాయకుడు ఎవరనే దానిపై పార్టీలో ఆసక్తి పెరగడానికి మరో కారణం కూడా ఉంది.

  2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. ఎంఐఎంకు పట్టు ఉన్న ప్రాంతాలను పక్కనపెడితే.. మిగతా ప్రాంతాలన్నీ గులాబీ పార్టీకి జై కొట్టాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి సీన్ మారిపోయిందని అర్థమైపోయింది. టీఆర్ఎస్‌ను సవాల్ చేసే స్థాయికి గ్రేటర్‌లో బీజేపీ ఎదిగింది.

  టీఆర్ఎస్ ఎంతగా శ్రమించినా.. బీజేపీ జోరును అడ్డుకోలేకపోయింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బీజేపీ కొంత బలహీనంగా కనిపిస్తున్నా.. గ్రేటర్ పరిధిలో మాత్రం బీజేపీ బలపడుతోందనే విషయాన్ని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. మరోవైపు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీప్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రేటర్‌ కాంగ్రెస్‌లోనూ కొంత జోష్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ టీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

  Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

  Revanth Reddy: రేవంత్ రెడ్డిని నిరాశ పరిచిన రాహుల్ గాంధీ.. ఆ ప్లాన్ ఫలించలేదా ?

  కొందరు సీనియర్ నేతలు, మరికొందరు జూనియర్ నేతలు ఈ పదవి కోసం రేసులో ఉండటంతో.. సీనియర్లకు ఛాన్స్ ఇస్తారా ? లేక జూనియర్లకు అవకాశం కల్పిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పదవికి ఎవరిని ఎంపిక చేసినా... రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే గ్రేటర్ పార్టీ చీఫ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. మరి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడి పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
  Published by:Kishore Akkaladevi
  First published: