తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. భారీ ఎత్తున ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలోనూ చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించిన గులాబీ బాస్.. కొందరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి మరికొందరికి హ్యాండ్ ఇచ్చారు. అయితే పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీగా (Telangana MLC) అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ (CM KCR) .. తెలంగాణ శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ (Telangana) శాసనమండలికి ఎమ్మెల్యే కోటా నుంచి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, గవర్నర్ కోటా నుంచి మధుసూదనాచారికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. మరికొందరు కూడా ఎమ్మెల్సీలుగా ఎంపికైనా.. మిగతా వాళ్లెవరికి లేని అవకాశం.. ఈ ముగ్గురు నేతల్లో ఒకరికి దక్కొచ్చనే చర్చ సాగుతోంది.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక కూడా పూర్తయిన తరువాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. అయితే కీలకమైన ఈ పదవి విషయంలో కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలో ఒకరికి దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా కొంతకాలం పని చేశారు. దీంతో మరోసారి ఆయనకు ఈ పదవి ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తే మధుసూదనాచారికి ఆ ఛాన్స్ వస్తుందని.. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్‌గా, మండలి చైర్మన్‌గా వ్యవహరించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టిస్తారు.
ఒకవేళ ఈ పదవి ఎస్సీలకు ఇవ్వాలని భావిస్తే.. సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరికి ఆ అవకాశం వస్తుంది. అయితే సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి కాబట్టి.. ఈ పదవికి వీరి ముగ్గురిని కాకుండా మరో నేతను కూడా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ఈ ముగ్గురిలో ఎవరికి మండలి చైర్మన్‌గా అవకాశం రాకపోతే.. వారిలో ఎవరో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేకపోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..
Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కావాలనేది చిరకాల కోరిక. దీని కోసమే ఆయన టీఆర్ఎస్ తరపున నల్లగొండ ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో కేబినెట్ విస్తరణ జరిగితే గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రిగా ఛాన్స్ ఉంటుందా ? అనే చర్చ జోరుగా సాగుతుంది. మొత్తానికి మండలికి ఎంపికైన ముగ్గురు సీనియర్ నేతల విషయంలో సీఎం కేసీఆర్ ఏ విధమైన ఆలోచనతో ఉన్నారన్నది త్వరలోనే తేలిపోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.