Home /News /politics /

WHO STANDS WHERE IN 2019 RAJYA SABHA DEPUTY CHAIRMANS ELECTION GIVES A GLIMPSE

2019లో ఎవరెటు? : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికతో క్లారిటీ?

రాజ్యసభ

రాజ్యసభ

రాజకీయాల్లో అంశాల వారీగా మద్దతు అనేది ప్రధానంగా వినిపించే మాట. గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల సందర్భంగా వివిధ పార్టీలు బీజేపీకి మద్దతు పలికాయి. ఆ తర్వాత అవే పార్టీలు కొన్ని అంశాల మీద వ్యతిరేకించాయి.

ఇంకా చదవండి ...
2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఐక్యంగా ముందుకు వెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్ ప్లస్ విపక్షాలకు ఫస్ట్ షాక్ తగిలింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను అనుకున్నదానికంటే బలంగా ఎదుర్కొంది ఎన్డీయే. అసలు అభ్యర్థిని గెలిపించుకుంటుందా అని భావించే దశ నుంచి.. 20 ఓట్ల మెజారిటీతో గెలివడం వెనుక వ్యూహం ఉంది. ఎన్డీయే తరఫున బరిలో దిగిన జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద 20 ఓట్ల తేడాతో గెలిచారు. హరిప్రసాద్‌కు 125 ఓట్లు వస్తే, విపక్ష అభ్యర్థికి 105 ఓట్లు మాత్రమే దక్కాయి.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్డీయే పక్షానికి అన్నాడీఎంకేకి చెందిన 13 మంది ఎంపీలు, టీఆర్ఎస్ (6), బీజేడీ (9) మంది ఎంపీలు జేడీయూ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. ప్రతిరోజూ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే శివసేన (3) కూడా చివరి నిమిషంలో బాసటగా నిలిచింది. తమను మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా జేడీయూ అభ్యర్థిని ఎంపిక చేయడం మీద అలిగినా.. చివరకు అనుకూలంగానే ఓటేసింది.

2019కి ముందు ఫస్ట్ టెస్ట్ లాంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ కావాల్సినంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ.. కేజ్రీవాల్‌కు ఓ ఫోన్ కాల్ చేస్తే.. మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఆప్ ప్రకటించింది. అయినా, హస్తం పార్టీ లైట్ తీసుకుంది. తటస్థంగా నిలిచే బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ ముందే ఫోన్ చేసి మద్దతు కోరితే.. కనీసం ఓటింగ్ సమయానికి వారు గైర్హాజరయ్యే వారేమో. కానీ, ఆ పని కూడా చేయలేకపోయింది. టీఆర్ఎస్ విషయంలో కూడా ఇదే జరిగింది. అభ్యర్థి ఎంపికలో తలెత్తిన గందరగోళం వల్లే కాంగ్రెస్ నష్టపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీలైనంత త్వరగా అభ్యర్థిని డిక్లేర్ చేసి.. ఆ తర్వాత మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తే.. ఫలితాలు మరోలా ఉండేవి కావొచ్చు. ఆ పని చేసింది కాబట్టే.. ఎన్డీయే అభ్యర్థికి 20 ఓట్లు ఎక్కువ వచ్చాయి.


ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. హరివంశ్‌కు ఓటేసిన జేడీయూ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అభయహస్తం అందించిన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే మాట మీద ఉంటాయా? కచ్చితంగా ఇది సమాధానం చెప్పలేని ప్రశ్నే. బరిలో నిలిచింది బీజేపీ అభ్యర్థి కాదు కాబట్టి.. నవీన్ పట్నాయక్, కేసీఆర్ మద్దతివ్వడానికి ముందుకొచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌వైపు జరుగుతున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో కూడా హస్తం పార్టీకి బాసటగా నిలుస్తుందా? రెండు పార్టీలు సైకిల్ సవారీ చేస్తాయా? అంటే చెప్పలేం.

రాజకీయాల్లో అంశాల వారీగా మద్దతు అనేది ప్రధానంగా వినిపించే మాట. గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల సందర్భంగా వివిధ పార్టీలు బీజేపీకి మద్దతు పలికాయి. ఆ తర్వాత అవే పార్టీలు కొన్ని అంశాల మీద వ్యతిరేకించాయి. వైసీపీనే తీసుకుంటే.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంశంలో మాత్రం గైర్హాజరైంది. శివసేన, బీజేడీ, టీఆర్ఎస్ కూడా అవిశ్వాసం సందర్భంగా గైర్హాజరయ్యాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతిచ్చాయి.


టీడీపీ- కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందంటూ తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని హస్తం పార్టీలో చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్‌తో దోస్తీ కోసం టీడీపీ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతిచ్చిందని, వైసీపీ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. హరిప్రసాద్‌కు ఓటేశారు కదా అని టీడీపీ కచ్చితంగా హస్తంతో దోస్తీ చేస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. తెలుగుదేశం పుట్టిందే.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని చాలాసార్లు ప్రకటించారు చంద్రబాబునాయుడు.

రాబోయే రోజుల్లో ఎవరు ఎటువైపు నిలుస్తారనేదానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో క్లారిటీ వచ్చిందా అంటే స్పష్టమైన సమాధానం చెప్పలేం. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాతే వీటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: BJD, Congress, Jds, JDU, NDA, Rajya Sabha, Tdp, TMC, Trs, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు