Home /News /politics /

WHO SET THE DEAL BETWEEN CHANDRABABU NAIDU AND AP CS LV SUBRAMANYAM IS THE NEW QUESTION IN AP POLITICAL CIRCLES BA

చంద్రబాబు, ఎల్వీ సుబ్రమణ్యం నవ్వులు.. పంతం నెగ్గించుకున్న..

చంద్రబాబునాయుడు, ఎల్వీ సుబ్రమణ్యం (File)

చంద్రబాబునాయుడు, ఎల్వీ సుబ్రమణ్యం (File)

సయోధ్య కుదరడంతో కేబినెట్ భేటీలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబు కూడా ఉల్లాసంగా కనిపించారు. దీంతో కేబినెట్ భేటీ కూడా సజావుగా సాగిపోయింది.

    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశం తర్వాత సీఎం, సీఎస్ మధ్య నెలకొన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయినట్లు కనిపించింది. అందుకే గతంలో జగన్ కేసుల్లో నిందితుడిగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని పేర్కొన్న చంద్రబాబు... కేబినెట్ భేటీలో మాత్రం ఆయనతో ఉల్లాసంగా నవ్వుతూ కనిపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కీలక తరుణంలో సీఎస్,సీఎం మధ్య విభేదాలు ఇరువురికీ మంచిది కాదన్న మధ్యవర్తుల సూచన మేరకు సీఎస్, సీఎం ఇద్దరూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కీలక అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించడం సరికాదని గతంలో సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యం మంత్రులతో పాటు సీఎం చంద్రబాబుకూ తెలిపారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రివ్యూల నిర్వహణ నైతికంగా మంచిది కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మాజీ సీఎస్ పునేఠా స్ధానంలో బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంపై గుర్రుగా ఉన్న చంద్రబాబు.. ఆయన మాట పెడచెవిన పెట్టారు. తాను పోలవరం, సీఆర్డీఏపై రివ్యూలు నిర్వహించారు. దీనిపై ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేయటంతో ఎన్నికల సంఘం సీఎస్ ను వివరణ కోరింది. దీంతో చేసేది లేక సీఎం రివ్యూల్లో పాల్గొన్న అధికారులపై సీఎస్ హోదాలో చర్యలు తీసుకునేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సిద్దమయ్యారు. దీనిపై టీడీపీ నేతలు కూడా బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఆ లోపు ఎల్వీకి ఐఏఎస్ అధికారులంతా ముక్తకంఠంతో మద్దతుగా నిలిచారు.

    ఏపీ కేబినెట్ సమావేశం


    సీఎస్ గా ఎల్వీసుబ్రహ్మణ్యం వ్యవహారశైలిపై చంద్రబాబు సైతం ప్రెస్ మీట్లలో విమర్శలు కొనసాగిస్తున్న సమయంలో ఆయన ఐఏఎస్ అధికారుల మద్దతు పొందడం సీఎంను ఇరుకునపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో రివ్యూలు వద్దంటున్న సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యంపై పంతం నెగ్గించుకునేందుకు కేబినెట్ భేటీకి సైతం చంద్రబాబు సిద్దమయ్యారు. కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలంటూ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సీఎస్ కు సమాచారం పంపారు. కేబినెట్ భేటీ కావాలంటే ముందుగా అజెండా ఇవ్వాలని, ఈసీ అనుమతి తీసుకోవాలంటూ సీఎస్ స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక అజెండా ఇవ్వడంతో పాటు ఈసీ అనుమతి కోరాలని చంద్రబాబు టీమ్ సీఎస్ కు సూచించింది. ఇదే సమయంలో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి రాకపోతే ఈ వివాదం మరింత ముదిరేలా ఉందని గమనించిన చంద్రబాబు సన్నిహితులు, ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు ఐఏఎస్ లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కలిసి కేబినెట్ భేటీకి ఎలాగైనా అనుమతి ఇప్పించాలని కోరారు. దీంతో సీఎస్ కాస్త వెనక్కి తగ్గారు. కేబినెట్ భేటీకి ముందురోజే సీఎం ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. దీంతో సగం సమస్య తీరింది. మరోవైపు సీఎంను కలిశాక కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఈసీని సీఎస్ కోరారు. దీంతో ఈసీ కూడా కొన్ని గంటల్లోనే షరతులతో కేబినెట్ భేటీకి అనుమతిచ్చింది.

    ఏపీ కేబినెట్ సమావేశం


    సయోధ్య కుదరడంతో కేబినెట్ భేటీలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబు కూడా ఉల్లాసంగా కనిపించారు. దీంతో కేబినెట్ భేటీ కూడా సజావుగా సాగిపోయింది. అదే పంతానికి పోయి ఉంటే కేబినెట్ భేటీ విషయంలో సీఎస్, ఈసీ కలిసి అనుమతి నిరాకరించి ఉండే అవకాశాలు ఉండేవని ప్రభుత్వంలో కొందరు ప్రముఖులు చెప్పుకుంటున్నారు. అలా కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లు కొంతకాలంగా సీఎస్, సీఎం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను కేబినెట్ భేటీ తీర్చినట్లయింది. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి కూడా సీఎస్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని కేవలం ఈసీతో మాత్రమే తమ సమస్య అని చెప్పుడాన్ని బట్టి తాజా పరిస్ధితి అర్ధమవుతోంది.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP CS LV Subramanyam, Chandrababu naidu, Election Commission of India, Lok Sabha Election 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు