ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ... ఎవరీ నత్వానీ?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పరిమళ్ నత్వానీ

Parimal Natwani | రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన గతంలో జార్ఖండ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

 • Share this:
  ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు విజయం సాధించారు. ఏపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి తోపాటు గుజరాత్‌కు చెందిన పరిమళ్ నత్వానీ కూడా ఎన్నికయ్యారు. ఎన్నికైన అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు పరిమళ్ నత్వానీ ప్రకటించారు. ‘ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు ఆయన బృందంతో కలసి రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేయనున్నాం. జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా నా 12 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో దశాబ్దాల నా అనుభవాన్ని దీని కోసం వినియోగించనున్నాను.’ అని అన్నారు.

  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన జార్ఖండ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి ఆయన 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడి కొనసాగారు. ఎంపీ ల్యాడ్ నిధులు, సాంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దాదాపు వంద శాతం నిధులను అభివృద్ధికి ఖర్చు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, పరిశుభ్రత, నైపుణ్యాభివృద్ధికి ఆయన తన ఎంపీ ల్యాడ్, ఇతర నిధులను వినియోగించారు. మూడు గ్రామాలను (బరాం - జరాతోలి, చుట్టు, బర్వాదాగ్) దత్తత తీసుకుని వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు.

  రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోర్ టీమ్‌లో పరిమళ్ నత్వానీ కూడా ఒకరు. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీని తన మెంటార్‌, రోల్ మోడల్‌గా చెబుతారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రిఫైనరీ కాంప్లెక్స్ నిర్మాణంలో పరిమళ్ నత్వానీ కీలక భూమిక పోషించారు. పశ్చిమ భారత దేశంలో రిలయన్స్ పెట్రోల్ రిటైల్ ఔట్‌లెట్స్, గ్యాస్ రవాణా పైప్‌లైన్, జియో మొబైల్ నెట్ వర్క్ విస్తరణలో ఆయన పాత్ర కీలకం.

  యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తి ఉన్న పరిమళ్ నత్వానీ తన సొంత నియోజకవర్గం జామ్ కంబాలియా నుంచి అసెంబ్లీకి పోటీ కూడా చేశారు. ప్రజా సేవ, ప్రజా సమస్యలను వివిధ వేదికల మీద వినిపిచే ఆయనకు ‘వాయిస్ ఆఫ్ సౌరాష్ట్ర’ అనే బిరుదు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా నత్వానీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా నిర్మాణంలో పునాది రాయి నుంచి కూడా ఆయన పర్యవేక్షణలో సాగింది. 2019 మధ్యంలో ఆయన గుజరాత్ ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికయ్యారు.

  గుజరాత్‌లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన బిజిసెస్ డెలిగేషన్‌లో పరిమళ్ నత్వానీ కూడా ఒకరు. చైనా, జపాన్, రష్యా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, ఉగాండా, కెన్యా సహా సుమారు 12, 13 దేశాల్లో ఆయన పర్యటించారు. వైబ్రంట్ గుజరాత్ ‌లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు నెలకొన్నాయి.

  గుజరాత్‌లోని ద్వారకాదీష్ ఆలయ ట్రస్ట్‌కు సుమారు 15 సంవత్సరాలుగా వైస్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయ బోర్డులో 9 సంవత్సరాలుగా సభ్యుడిగా కొనసాగుతున్నారు. ‘గిర్ లయన్ - ప్రైడ్ ఆఫ్ గుజరాత్’, ‘జార్ఖండ్ మేరీ కర్మభూమి’ అనే పుస్తకాలు పరిమళ్ నత్వానీ శక్తిసామర్థ్యాలను తెలియజేస్తాయి.
  First published: