మారుమోగుతున్న ఏపీ మండలి ఛైర్మన్ పేరు... అమరావతిలో ప్రశంసల జల్లు...

ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇస్తూ... రెండు కీలక బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ... ఏపీ శాసన మండలి ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. అసలు ఆయన ఎవరు అని అంతా చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: January 23, 2020, 9:51 AM IST
మారుమోగుతున్న ఏపీ మండలి ఛైర్మన్ పేరు... అమరావతిలో ప్రశంసల జల్లు...
ఎం ఏ షరీఫ్ (credit - twitter - M.A. Shariff)
  • Share this:
మొహమ్మద్ అహ్మద్ షరీఫ్... ఎం.ఎ.షరీఫ్‌గా టీడీపీ నేతలకు సుపరిచితుడైన నేత ఆయన. నిన్న మొన్నటి వరకూ సాధారణ జనానికి పెద్దగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా మార్మోగుతోంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ సర్కారు తీసుకొచ్చిన రెండు బిల్లులను శాసన మండలి ఛైర్మన్‌గా తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపాలని ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీ సర్కారులో ప్రకంపనలు రేపింది. షరీఫ్ నిర్ణయం కోసం జగన్ కేబినెట్ అంతా మండలికి వచ్చి ఎదురుచూశారంటే ఆయన తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎం.ఎ షరీఫ్ రాజకీయ అరంగేట్రం, టీడీపీలో ఆయన కెరీర్, మండలి ఛైర్మన్ వరకూ సాగిన ప్రస్ధానం ఓసారి తెలుసుకోవాల్సిందే.

1955లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన షరీఫ్ విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. నరసాపురం వైఎన్ కళాశాలలో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే 1974-75 మధ్య షరీఫ్ కళాశాల విద్యార్ధి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత భోపాల్ కాలేజ్ నుంచి ఎంకాం, ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. 27 ఏళ్లకే పెళ్లి చేసుకున్న షరీఫ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆయన బలమైన కోరిక టీడీపీ ఆవిర్భావంతో నెరవేరింది. 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించినప్పుడు నరసాపురంలో 11 మందితో కలిసి టీడీపీ ఆవిర్భావాన్ని ప్రకటించారు. ఆ తర్వాత నరసాపురం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన షరీఫ్... 1985-87 మధ్య పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ కార్యదర్శిగానూ వ్యవహరించారు. చంద్రబాబు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో షరీఫ్ విజయనగరం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు పార్టీ పరిశీలకుడిగా కూడా పనిచేశారు. 31 ఏళ్ల వయసులోనే ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఆయనకు అవకాశం దక్కింది. 1990 నుంచి 97 మధ్యకాలంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా షరీఫ్ పనిచేశారు. 1997లో తిరిగి మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నామినేట్ అయిన షరీఫ్ తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీలో మంచి గుర్తింపు పొందారు.

టీడీపీ రాష్ట్ర ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ గానూ పనిచేసిన షరీఫ్ సీనియర్ నేతలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఆయన నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2009 వరకూ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ షరీఫ్ వ్యవహరించారు. 1999, 2004, 2009లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక కమిటీలోనూ షరీఫ్ కీలకంగా ఉన్నారు. 2015లో తొలిసారి టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన షరీఫ్‌కు,... 2017నాటికి టీడీపీ విప్‌గా కూడా పనిచేసే అవకాశం దక్కింది. 2019 సంవత్సరం ఆయన కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఇదే సంవత్సరం ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌ను అప్పటి మండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్.ఎం.డీ ఫరూక్ స్ధానంలో ఛైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఫరూక్‌ను మైనార్టీ మంత్రిగా చంద్రబాబు ప్రకటించడంతో ఆయన స్ధానంలో ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం షరీఫ్‌కు దక్కింది. అప్పటి నుంచి ఆయన మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబుతో దాదాపు సమానంగా రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం. రాజకీయాల్లో ఉన్నప్పటికీ నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ, షరీఫ్ మాత్రం సగటు రాజకీయవేత్త కాదు. రెండు రోజులుగా మండలి సమావేశాలను నిర్వహించిన తీరు చూస్తే ఈ విషయం సులువుగానే అర్థమవుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న షరీఫ్... రాజధానులకు సంబంధించిన కీలక బిల్లులను కూడా నిబంధనలకు మేరకు అనుమతించారు. అదే నిబంధనల మేరకు టీడీపీ సవరణ తీర్మానాలు ఇవ్వలేదని తెలిసి ఆ విషయాన్ని కూడా సభలోనే ప్రకటించారు. అయితే చివర్లో ఒత్తిళ్లకు మాత్రం షరీఫ్ తలొగ్గినట్లు సెలక్ట్ కమిటీ నిర్ణయాన్ని బట్టీ అర్ధమవుతోంది.(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్ 18)
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు