Home /News /politics /

WHITE PAPERS VS BLACK PAPERS IN ANDHRAPRADESH POLITICS

తెలుపు పత్రాలు వర్సెస్ నలుపు పత్రాలు.. ఏపీలో సరికొత్త రాజకీయం

tdp vs ysrcp file

tdp vs ysrcp file

ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. అధికార, ప్రతిపక్ష పార్టీలమధ్య నలుపు, తెలుపు పత్రాల యుద్ధం మొదలైంది. ఇంతకీ, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి?

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీల మధ్య రసవత్తర పోరు మొదలైంది. నలుపు, తెలుపు పత్రాలతో పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపథకాలను, రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. 10రోజుల పాటు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ముఖ్యమంత్రి తొలి శ్వేత పత్రం విడుదల చేశారు. అంశాల వారిగా 10రోజుల పాటు ఈ శ్వేత పత్రాల విడుదల కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్వేతపత్రాల ద్వారా కేంద్రంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నామని, హామీల అమలును జాప్యం చేయడంపై కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

    ఇక, టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను.. చంద్రబాబు వేసిన మరో ఎత్తుగడగా ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల తరుణంలో శ్వేతపత్రాల పేరిట చంద్రబాబు కొత్తనాటకానికి తెరలేపారని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఇది చంద్రబాబు పన్నిన కొత్త పన్నాగమన్నారు. శ్వేత పత్రాల వల్ల ఒనగూరేదేమీ లేదన్నారు. గతంలో వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి శ్వేత పత్రాలు విడుదల చేశారని.. అందుకు ప్రతిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బాబు పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ బ్లాక్ పేపర్స్‌ను విడుదల చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేసిన వారం రోజుల తర్వాత.. వాటికి సమాధానంగా వైసీపీ తరపున బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.
    హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆనం.. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుచేసేందుకు కేంద్రం సిధ్దమవుతున్న తరుణంలో.. తానే నిర్మిస్తానంటూ చంద్రబాబు ముందుకు రావడం వెనుక కుంభకోణం దాగుందని ఆరోపించారు. ఫ్యాక్టరీకి శంఖుస్దాపన చేసే స్థలానికి సమీపంలో.. టీడీపీ ఎంపీ తన బినామీతో 5000 ఎకరాల భూమి కొనుగోలు చేయించారని చెప్పారు. భూముల సేకరణ పేరిట వందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నామంటున్న చంద్రబాబు.. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి నిధులు ఎక్కణ్నుంచి తెస్తారని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు లబ్ది చేకూర్చేందుకే.. ఎన్నికల వేళ ఈ ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన ఈ పత్రాల గొడవ.. ఎటు దారితీస్తుందో చూడాలి.
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: Andhra Pradesh, Ap, AP Politics, Chandrababu naidu, Tdp, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు