ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బీజేపీ ఆశిస్తోన్న రాజకీయ ప్రయోజనాలేంటి?

కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ అవమానాలకు గురయ్యాడన్న విషయాన్ని బీజేపీ భవిష్యత్తులో హైలైట్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాలీ అయిన ప్రణబ్‌కు భారతరత్న పురస్కారాన్ని అందించడం ద్వారా బెంగాల్‌లో కూడా పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందని కమలదళం భావిస్తోంది.

news18-telugu
Updated: January 26, 2019, 12:49 PM IST
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బీజేపీ ఆశిస్తోన్న రాజకీయ ప్రయోజనాలేంటి?
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(File)
  • Share this:
ఒకప్పుడు రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను తన చేతుల మీదుగా ఇతరులకు అందజేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇప్పుడు తానే స్వయంగా ఆ పురస్కరాన్ని అందుకోబోతున్నారు. నిజానికి ఇంతటి పురస్కారానికి తాను అర్హుడినో.. కాదో.. అంటూ ఒకింత సంశయాన్ని కూడా ప్రణబ్ వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాజనీతిజ్ఞుడిగా.. మచ్చ లేని నాయకుడిగా ప్రణబ్‌కు ఉన్న క్లీన్ ఇమేజే ఆయనకు ఇంతటి విశిష్ట పురస్కారం లభించేలా చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తంగా ప్రణబ్‌కు అవార్డు ఇవ్వడంపై ఎక్కడా ఎలాంటి విమర్శలు లేవు.
కానీ ప్రణబ్‌కు అవార్డు ఇవ్వడం వెనుక బీజేపీ ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏంటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ప్రణబ్‌కు అవార్డు ఇవ్వడం ద్వారా రెండు అంశాలను బీజేపీ హైలైట్ చేయాలని భావిస్తోంది. ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన నాయకులకు 'కాంగ్రెస్ కల్చర్' ప్రతిబంధకంగా ఉంటుందని.. అందుకే ప్రధాని పదవికి అర్హుడైన ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ ఆ స్థాయి గౌరవాన్ని ఇవ్వలేదని బీజేపీ పరోక్షంగా చెబుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్దార్ పటేల్‌ను ఎంత విశిష్టంగా గౌరవించామో.. ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత ప్రణబ్‌ను కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అత్యున్నత పురస్కారంతో గౌరవిస్తున్నామన్న సంకేతాలను బీజేపీ పంపిస్తోంది.


కాబట్టి ప్రణబ్‌కు బీజేపీ భారతరత్న పురస్కారం అందించడమన్నది కాంగ్రెస్‌కు కాస్త చేదుగా అనిపించే తీపి కబురు లాంటిది. రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రణబ్.. ప్రధాని పదవిని చేపట్టాల్సినవాడన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. కానీ అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అందుకు అడ్డుపడ్డారన్న ప్రచారం ఉంది. ప్రణబ్‌ను పూర్తిగా విశ్వసించని కారణంగానే.. సోనియా మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ప్రణబ్ తనతో విభేదించే అవకాశాలు ఉంటాయని.. మన్మోహన్ సింగ్ అయితే తన మాటకు పూర్తిగా కట్టుబడి ఉంటాడన్న ఉద్దేశంతోనే సోనియా ఆయన్ను పక్కనపెట్టారన్న వాదన ఉంది.

అంతేకాదు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయడం కూడా సోనియా గాంధీకి అంతగా ఇష్టం లేదని, అయితే తనపై వచ్చిన ఒత్తిడి కారణంగానే అందుకు ఆమె ఒప్పుకోవాల్సి వచ్చిందన్న ప్రచారం ఉంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ అవమానాలకు గురయ్యాడన్న విషయాన్ని బీజేపీ భవిష్యత్తులో హైలైట్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాలీ అయిన ప్రణబ్‌కు భారతరత్న పురస్కారాన్ని అందించడం ద్వారా బెంగాల్‌లో కూడా పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందని కమలదళం భావిస్తోంది.

ఇది కూడా చదవండి : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బెంగాల్‌లో బీజేపీకి ప్లస్ అవుతుందా?
First published: January 26, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading