తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకున్నట్టు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆ టెన్షన్‌కు కారణం ఏంటంటే.. మరో మూడు రోజుల్లో ఆగస్ట్ నెల రానుంది. ఆగస్ట్ అంటే టీడీపీకి కలసి రాని నెల. ఆగస్ట్ నెలలో టీడీపీ ఎన్నోన సంక్షోభాలను ఎదుర్కొంది. 1984లో ఎన్టీఆర్‌ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయింది ఆగస్ట్ లోనే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను దించి.. చంద్రబాబునాయుడు సీఎం అయింది కూడా ఆగస్ట్ నెలలోనే. తెలుగుదేశం ప్రభుత్వానికి మాయని మచ్చలాంటి బషీర్ బాగ్ కాల్పుల ఘటన కూడా ఆగస్ట్ లోనే జరిగింది. చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన హరికృష్ణ.. సొంతంగా పార్టీ పెట్టారు. ఆ తిరుగుబాటు కూడా ఆగస్ట్‌లోనే జరిగింది. దీంతోపాటు టీడీపీలో ముఖ్యనేత లాల్ జాన్ పాషా కూడా ఆగస్ట్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నందమూరి హరి కృష్ణ కూడా ఆగస్ట్ నెలలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రధానమైన సంఘటనలు.. ఇంకా మరెన్నో సంక్షోభాలు ఆగస్ట్ నెలలోనే ఎదురయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈసారి ఎదురయ్యే సంక్షోభం ఏంటనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయం అధినేత చంద్రబాబు, చినబాబు లోకేష్ వద్ద కూడా ప్రస్తావిస్తున్నట్టు సమాచారం.
బీజేపీ నుంచే ఎదురుకానుందా?
ఏపీలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి, ఆ స్థానంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో నలుగురు రాజ్యసభ ఎంపీలను ఇప్పటికే లాగేసింది. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయి.. ఏకంగా టీడీపీ శాసనసభాపక్షాన్ని కూడా లేకుండా చేస్తారా? ఈ తతంగం అంతా ఆగస్ట్ నెలలోనే జరుగుతుందా? అనే చర్చ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.