• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • WHAT IS TUMMALA NAGESWARA RAO ROLE IN TRS NOW WHY HE IS AWAY FROM CURRENT POLITICS SK KMM

Telangana: తుమ్మల దారెటు.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్‌లో అసంతృప్తి

Telangana: తుమ్మల దారెటు.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్‌లో అసంతృప్తి

తుమ్మల నాగేశ్వరరావు(ఫైల్ ఫోటో)

ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి రెండేళ్లు పూర్తయినా తుమ్మలకు కేసీఆర్‌ ప్రభుత్వంలో సముచితమైన స్థానం దక్కకపోవడం పట్ల ఆయన సామాజికవర్గంలో ఒకింత అసహనం, ఆలోచన రేకెత్తిస్తోంది. ఆయన్ను అవసరానికి వాడుకుని వదిలేశారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం జిల్లా ప్రతినిధి)

  ఖమ్మం జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తొచ్చేది తుమ్మల నాగేశ్వరరావు పేరే. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా.. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన తుమ్మల ఇప్పుడు ఎక్కడున్నారు. ఏంచేస్తున్నారు..? ఆయన రాజకీయ చాణక్యాన్ని.. అభివృద్ధి వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి వాడుకోవడం లేదా..? సముచితమైన ప్రాధాన్యం కల్పించడం లేదా..? తరాలు మారుతున్న రాజకీయంలో ఇప్పుడు తుమ్మల స్థానమెక్కడ..? ఆయన దారెటు అన్నదే పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. అప్పుడప్పుడూ పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. జనంతో టచ్‌లో ఉంటున్నప్పటికీ.. ఎక్కడో తెలీని గ్యాప్‌ ఇంకా వెంటాడుతునే ఉంది. ఇప్పటికీ తుమ్మల వస్తున్నారంటే నియోజవర్గంలో ఒక వేవ్‌లా జనం కదిలే పరిస్థితి ఉంది. అయినా ఎన్నో ఎన్నికలు వచ్చిపోతున్నా.. ఎవరెవరికో అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలో సముచిత స్థానాలు, పదవులు కట్టబెడుతూ ప్రాధాన్యం కల్పిస్తున్నప్పటికీ.. సీనియర్‌ అయిన తుమ్మలకు ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లేకుండా నేరుగా సీఎం కేసీఆర్‌ను కలవగలిగే అతి తక్కువ మందిలో తుమ్మల ఒక్కరుగా తెరాస వర్గాల్లో ఇప్పటికీ చెబుతుంటారు. మరి ఇప్పుడు ఏమైంది.. అసలు ఏంజరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆయన అభిమానులు.. అనచరగణంలో ఇదో అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది.

  ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావును మరిపించిన నేతగా తుమ్మలకు పేరుంది. పైగా వీళ్లిద్దరూ సత్తుపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి ఆయన వెంటే నడచిన తుమ్మల.. ఆనక మారిన పరిస్థితుల్లో చంద్రబాబుకు చేదోడుగా ఉంటూ ప్రభుత్వంలో అనేక కీలక మంత్రిత్వశాఖలు నిర్వర్తించారు. భారీ నీటిపారుదల, ఆర్‌ అండ్‌ బి, ఎక్సైజ్‌ లాంటి కీలక శాఖలను నిర్వర్తించిన తుమ్మలకు పాలనా దక్షునిగా పేరుంది. తనతో కలసి పనిచేసిన ఐఏఎస్‌ అధికారులతో తుమ్మల ఇప్పటికీ టచ్‌లో ఉంటారని పేరు. ఆయన ఫోన్‌ చేస్తే సెంట్రల్‌ సర్వీస్‌లో డిప్యుటేషన్‌ మీద ఢిల్లీ ఆఫీసర్లయినా సరే వేగంగా స్పందించి పని చేసే స్థాయి ఇప్పటికీ ఉందన్నదీ నిజమే. ఇది పదవిలో ఉన్నా లేకున్నా తుమ్మలకు ఆఫీసర్లు ఇచ్చే మర్యాదగా అందరూ చెబుతుంటారు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా.. వ్యవస్థ కోసం ఉపయోగించిన నాయకునిగా తుమ్మలను ఉదహరిస్తుంటారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు తెలీని ఊరు.. ఏరు.. వాగు.. వంక ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ ఏ నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే ఎక్కడి భూములను సస్యశ్యామలం చేయొచ్చు.. ఎక్కడ చెక్‌ డ్యాం కడితే ఎక్కడెక్కడి పొలాలకు ఎత్తిపోతల ద్వారా నీరివ్చొచ్చన్నది తుమ్మలకు కరతలామలకం. మంత్రిగా పనిచేసిన సమయంలో ఇంజినీర్లు.. ఇతర అధికారులతో తుమ్మల చేసే సమీక్షలు ఓ ప్రొఫెసర్‌ లెస్సన్‌ చెప్పినట్టుగా ఉంటుందంటారు.

  ఇక గిరిజన ప్రాంతాలలో ఏ గూడేనికి దగ్గరి దారేది..? ఎక్కడ బ్రిడ్జి కడితే తక్కువ ఖర్చులో పూర్తవుతుందన్న విషయాలు ఆయనకు ఫింగర్‌ టిప్స్‌. కోయ భాషలో మాట్లాడుతూ గొత్తికొయలు, కోయ తెగకు చెందిన ప్రజలతో మమేకం అయ్యే తుమ్మల.. వ్యవసాయం అన్నా.. రైతన్నా.. ఎనలేని మక్కువ చూపుతుంటారు. బహుశా అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం బంగారు తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్‌ తన టీంలో తుమ్మలను చేర్చుకున్నారు. అప్పటికే ఖమ్మం ఎమ్మెల్యేగా తెదేపా తరపున పోటీ చేసి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఓటమి పాలైన తుమ్మలను తన దరికి చేర్చుకున్నారు. రాజకీయంలో మచ్చలేని నేతగా, వివాద రహితునిగా పేరున్న తుమ్మల తన వెంట ఉంటే.. తెలంగాణలోని హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతంలో మిక్కిలిగా ఉన్న తుమ్మల సామాజికవర్గానికి దగ్గర కావొచ్చన్న వ్యూహంతోనే కేసీఆర్‌ అప్పట్లో ఆ అడుగు వేశారు. తుమ్మలను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుని.. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు నుంచి పోటీ చేయించిన విషయం తెలిసిందే.
  మంత్రి నిరంజన్ రెడ్డితో తుమ్మల

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా భారీగా నష్టపోయామన్న భావనలో ఉన్న ఒక సామాజిక వర్గానికి అప్పట్లో తుమ్మలను మంత్రి వర్గంలోకి తీసుకోవడాన్ని గొప్ప ఉపశమనంగా చెబుతారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సినీ, మీడియా, సాగు రంగాలలో నిలదొక్కుకున్న సెటిలర్లుగా పేరుబడిన తుమ్మల సామాజిక వర్గం నాటి నుంచి కేసీఆర్‌ పట్ల సానుకూలత పెంచుకుందన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తుంటారు. తమ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వంలో తుమ్మల లాంటి ఒక ఐకాన్‌ ఉంటే మాకు అంతే చాలు.. అన్న ధోరణిని కూడా బహిరంగంగానే వెలిబుచ్చిన సందర్భాలు తెలిసినవే. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తెలంగాణకు నేషనల్‌ హైవేలను మంజూరు చేయించడంలో తుమ్మల చూపిన చొరవను గుర్తు చేస్తుంటారు.

  అయితే 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన పాలేరులో అనూహ్యంగా ఓటమి పాలవడం.. దీనికి పార్టీలోని వర్గపోరే కారణమని.. 'మా కత్తులే మాకు గుచ్చుకున్నాయంటూ.. తుమ్మల ఓటమి పట్ల కేసీఆర్‌ ఒకింత ఎమోషనల్‌ అయిన విషయం ప్రస్తావనార్హం. అయితే ఓటమి చెందినా.. తుమ్మల లాంటి నేతను కేసీఆర్‌ వదులుకోరని.. ఆయన అనుభవాన్ని.. విషయ పరిజ్ఝానాన్ని ప్రభుత్వానికి వాడుకుంటారని ఆయన అభిమానులు భావించారు. ఆ రోజు కోసం ఇప్పటికీ వేచిచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి రెండేళ్లు పూర్తయినా తుమ్మలకు కేసీఆర్‌ ప్రభుత్వంలో సముచితమైన స్థానం దక్కకపోవడం పట్ల ఆయన సామాజికవర్గంలో ఒకింత అసహనం, ఆలోచన రేకెత్తిస్తోంది. ఆయన్ను అవసరానికి వాడుకుని వదిలేశారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అయితే సరైన సమయంలో సీనియర్లకు సరైన ప్రాధాన్యం దక్కుతుందని ఎవరికి వాళ్లే సమాధానపర్చుకుంటున్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిలో తుమ్మల పట్ల ఉన్న భావనలో ఏమార్పు లేదని.. తుమ్మలకు ప్రాధాన్యం కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో తమ సామాజికవర్గానికి ఐకాన్‌ లాంటి వ్యక్తిని గుర్తించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తమను భాగస్వాములను చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంటారు. అప్పుడప్పుడూ ఆపార్టీ ఈపార్టీలో చేరబోతున్నారంటూ వార్తలొచ్చినా.. అనుచరగణం, అభిమానుల్లో స్పెక్యులేషన్లు రేగినా పెద్ద స్పందించని తుమ్మల .. తన రోజు కోసం ఎదురుచూస్తున్నారన్నది నిజం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు