Andhra Pradesh : ఏపీ రాజకీయాల్లో రాజధాని తరలింపు అంశం తెరపైకి వచ్చాక... ఇతర అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. అందులో ఒకటి కాపు రిజర్వేషన్. గత టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతున్నప్పుడు... కాపు నేతగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ముద్రగడ పద్మనాభం... కాపు రిజర్వేషన్ హామీపై గట్టిగానే పోరాడారు. అప్పట్లో ఈ పోరాటాల్లో భాగంగా... అగంతగులు... తునిలో రైలును తగలబెట్టిన ఘటన పెను సంచలనం అయ్యింది. అదే సమయంలో... కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం... అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ... ఈబీసీ బిల్లును ఆమోదించింది. అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వం... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ... బిల్లును ఆమోదించి... కేంద్రానికి పంపింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో... కాపు రిజర్వేషన్ అంశం అటకెక్కింది. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి... కేబినెట్‌లో కాపు వర్గానికి పెద్ద పీట వెయ్యడం... కన్న బాబు, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్ వంటి వారికి కేబినెట్ బెర్తులు ఇవ్వడంతో... కాపులకు రిజర్వేషన్ లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ... ఆ విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. వైసీపీ సర్కార్.... కాపుల కోసం రూ.1000 కోట్ల నిధులు కేటాయించింది గానీ... రిజర్వేషన్‌పై మాత్రం నోరు మెదపట్లేదు.
ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి... సీఎం జగన్... ఒకే రాజధాని మూడు చోట్ల ఏర్పాటు అభిప్రాయాన్ని స్వాగతించారు. దాంతో... కాపుల మద్దతు తమకే ఉందని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో... కాపు వర్గానికే చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... రాజధాని తరలింపు అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతమాత్రాన కాపులంతా సీఎం జగన్ అభిప్రాయంతో విభేదిస్తున్నట్లు అనుకోవడానికి లేదు. రాజధానిని అమరావతి నుంచీ తరలిస్తే... గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కాపులకు ఇది అంతగా రుచించకపోవచ్చు. మరి కాపులకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం వారిని దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ విషయంపై మౌనాన్నే ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP News, AP Politics, Chiranjeevi, Kapu Reservation, Mudragada Padmanabham, Ys jagan