ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 133, వ్యతిరేకంగా 0, తటస్థంగా 0 ఓట్లు పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనమండలి రద్దుకు అనుకూలంగా మంత్రులైన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా మండలి రద్దుకు జైకొట్టారు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం టీడీపీకి 28, వైసీపీకి 9, పీడీఎఫ్ 5, నామినేటెడ్ 8, స్వతంత్రులు 3, బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ వైసీపీ ఎమ్మెల్సీల ఫ్యూచర్ ఏంటి?
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ)
- పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- షేక్ మొహమ్మద్ ఇక్బాల్ (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- జంగా కృష్ణమూర్తి (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- చల్లా రామకృష్ణారెడ్డి (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- దేవసాని చిన్న గోవిందరెడ్డి (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- గంగుల ప్రభాకర్ రెడ్డి (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ)
- వెన్నపూస గోపాల్ రెడ్డి (అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ)
శాసనసభ ఆమోదించిన అది పార్లమెంట్ ఆమోదం పొందే వరకు మండలి మనుగడలోనే ఉంటుంది. అయితే, అసలు సభ రద్దుకు ముందు జగన్ ఆయా ఎమ్మెల్సీలకు ఎలాంటి హామీ ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవులను కూడా కోల్పోనున్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కేబినెట్ భేటీలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది ఆయా నేతలు చర్చించుకుంటున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 27, 2020, 18:24 IST