దగ్గుబాటి దారెటు? సతి వెంట నడుస్తారా? సైలెంట్ అవుతారా?

దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఎమ్మెల్సీగా నామినేట్ అయి శాసనమండలిలో అడుగుపెడతారా...? లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అనేదానిపై క్లారిటీ రావడం లేదు.

news18-telugu
Updated: June 6, 2019, 5:27 PM IST
దగ్గుబాటి దారెటు? సతి వెంట నడుస్తారా? సైలెంట్ అవుతారా?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం (File)
  • Share this:
2019 ఎన్నికల్లో ఏపీ అంతటా ఫ్యాన్ గాలి జోరుగా వీచింది. జగన్ సునామీ దెబ్బకు.. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని అనేక మంది భారీ మెజార్టీతో విజయం సాధించారు. కానీ, ప్రకాశం జిల్లాలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడ పారలేదు. మాజీ సీఎం చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చేలా జగన్ పన్నిన వ్యూహం బోల్తా కొట్టింది. ఆ వ్యూహమే దగ్గుబాటి వెంకటేశ్వర్రావు. టీడీపీ తన చరిత్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా కూడా.. పర్చూరులో మాత్రం వైసీపీని అడ్డుకోగలిగింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, ఆయన తనయుడుని వైసీపీలో చేర్చి.. పర్చూరు నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ, పౌరసత్వ వివాదం ఉండటంతో.. దగ్గుబాటే స్వయంగా పర్చూరు నుంచి పోటీ చేశారు. ఆయన గెలవడం గ్యారెంటీ - ఆయనను అసెంబ్లీలో స్పీకర్ గా చేసి చంద్రబాబు చేత 'అధ్యక్షా..' అని జగన్ పిలిపించడం గ్యారెంటీ అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనూహ్యంగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్పమైన ఓట్ల తేడాతోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరాజయం చెందారు. అసెంబ్లీలో కూడా మాజీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇవ్వాలనుకున్న వైసీపీ వ్యూహం పారలేదు. కానీ, ఇప్పుడు దగ్గుబాటి పయనం ఎటు అనేది వైసీపీలో చర్చగా మారింది.

ఎమ్మెల్సీగా నామినేట్ అయి శాసనమండలిలో అడుగుపెడతారా...? లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వర్రావు భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. విశాఖపట్నం లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూడా ఆమె బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చెందారు. ఈ సారి భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి.. ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఇద్దరూ ఎవరి పార్టీలో వారే ఉంటారా? లేకపోతే ఇద్దరూ కలసి ఒకే పార్టీలో చేరతారా? అనే చర్చ జరుగుతోంది.

(డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>