HOME »NEWS »POLITICS »what happened to those billes which sent to select committee by ap legislative council ba

మండలిలో సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులు ఏమయ్యాయి?

మండలిలో సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులు ఏమయ్యాయి?
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్

ప్రస్తుతం శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది ప్రాసెస్ లో ఉండగా సెలక్ట్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    ఏపీ శాసన మండలి ఆమోదించకుండా, తిరస్కరించకుండా సెలక్ట్ కమిటీకి పంపిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల తాజా పరిస్ధితి ఏమిటి ? వాటిని పరిశీలనకు పంపేందుకు వీలుగా మండలి ఛైర్మన్ షరీఫ్ ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైంది? నిబందనలకు అనుగుణంగా లేని కారణంగా సెలక్ట్ కమిటీ ఎంపిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు అంగీకరించడం లేదా? రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బిల్లులను పంపుతామన్న మండలి ఛైర్మన్ ప్రకటన తర్వాత ఏం జరిగింది ? ఇప్పుడు ఏపీలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.

    ఏపీలో శాసనమండలి రద్దు కోసం ఓవైపు కేంద్రంతో లాబీయింగ్ ప్రారంభించిన జగన్ సర్కారు ఇప్పటికే మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపాల్సిన రెండు బిల్లుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అంటే అవుననే సమాదానమే వస్తోంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత రెండు బిల్లులు సభ ముందుకు వచ్చినప్పుడు వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా రూల్ 71 కింద చర్చకు అనుమతించిన ఛైర్మన్ షరీఫ్ ఆ తర్వాత కీలక సమయంలో సదరు బిల్లులను తన విచక్షాధికారం మేరకు సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. సభ ముగిసిన తర్వాత రోజు మీడియాతో మాట్లాడిన షరీఫ్ రెండు రోజుల్లో సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసి బిల్లులను పంపుతామన్నారు. అందుకు తగినట్లుగానే సెలక్ట్ కమిటీకి తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను పంపాలని మండలిలో పార్టీల ప్రతినిధులకు ఆయన లేఖలు కూడా రాశారు. అయితే పార్టీల నుంచి ఆయనకు పేర్లు అందకుండానే ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలను చూపుతూ దీనికి అసెంబ్లీ అదికారులు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలక్ట్ కమిటీ నోటిఫికేషన్ జారీ నిలిచిపోయింది.



    సెలక్ట్ కమిటీ ఎంపిక నోటిఫికేషన్ జారీ అయితే ఆ తర్వాత పార్టీల నుంచి వచ్చిన పేర్లను తీసుకుని సభ్యుల ఎంపిక పూర్తి చేసి రెండు బిల్లులను కమిటీ పరిశీలనకు పంపాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది ప్రాసెస్ లో ఉండగా సెలక్ట్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం తప్పడం లేదు. అయితే నోటిపికేషన్ ఎప్పటికల్లా జారీ అవుతుందో కూడా చెప్పలేని పరిస్ధితి నెలకొంది. టీడీపీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఛైర్మన్ షరీఫ్ నోటిఫికేషన్ జారీకి ఆదేశాలు ఇచ్చినా నిబంధనల కారణంగా అధికారులు జారీ చేయలేని పరిస్దితి ఉంది. ఎల్లుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో మండలి రద్దుకు కేంద్రం చర్యలు ప్రారంభిస్తే ఉభయసభల ఆమోదం తర్వాత ఎలాగో ఈ ప్రక్రియ మూడు నెలల్లోపు పూర్తవుతుంది. ఆ లోపు సెలక్ట్ కమిటీ నోటిఫికేషన్ జారీ కాకుండా ఉంటే మాత్రం మండలి రద్దుతో బిల్లుల వ్యవహారం నుంచి గట్టెక్కాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్ 18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 30, 2020, 20:27 IST

    टॉप स्टोरीज