రాజకీయాల్లో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. 2014లో వెలిగిపోయిన మోదీ ప్రభ 2019 ఎన్నికలు దగ్గరపడేసరికి .. మసకబారుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన పరాభవమే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెబుతున్నాయి విపక్షాలు. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ మరోసారి ఢిల్లీ గద్దెనెక్కే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నాయి.
ఇక, తాజా ఎన్నికల ఫలితాలు, విపక్షాల జోరు చూసి.. కమలనాథుల్లో కంగారు పుట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కాకముందే అధ్యక్షుడు అమిత్షా రంగంలోకి దిగినట్టు స్పష్టమవుతోంది. బీహార్లో మిత్ర పక్షం జేడీయూతో కలిసి పోటీచేసే పార్లమెంటు సీట్లు సర్దుబాటు చేసుకుంది బీజేపీ. మొత్తంగా 40 పార్లమెంట్ స్థానాలున్న బీహార్లో బీజేపీ, జేడీయూ చెరో 17 స్థానాల్లో పోటీ చేయాలని, మిగిలిన స్థానాలను చిన్నాచితక మిత్రపక్షాలకూ వదిలేయాలని నిర్ణయించాయి. ఈ సీట్ల సర్దుబాటే, బీజేపీ ప్రభ తగ్గించదనడానికి నిదర్శనమని చెప్పొచ్చు.
2014ఎన్నికల్లో బీహార్లో ఏకంగా 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ.. గతంలో గెలిచినన్ని స్థానాల్లో కూడా ఈసారి పోటీ చేయడం లేదు. 40 స్థానాల్లో కేవలం 17 స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాలను మాత్రమే దక్కించుకున్న జనతాదళ్ యూనైటెడ్(జేడీయూ)కు తనతో సమానంగా 17 స్థానాలకు కట్టబెట్టేసింది. అప్పుడు ఎవరి సాయం లేకుండా, ఒంటరిగా బరిలోకి దిగి 20కి పైగా స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ.. ఇప్పుడు మిత్రపక్షాలతో సర్దుబాటు చేసుకునే స్థాయికి చేరిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీ ప్రభ తగ్గుతోందని, కమలం పార్టీ నేతలే స్వయంగా ఒప్పేసుకున్నట్టేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీజేపీతో ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు తెగదెంపులు చేసుకుంటున్నాయి. ఇంతకు ముందు టీడీపీ, ఇప్పుడు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాయి. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ పరిస్థితే బీజేపీ అధిష్ఠానంలో వణుకు పుట్టిచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు, బీజేపీలోనూ మునుపటి పరిస్థితి కనిపించడం లేదు. మోదీ కాకపోతే, మరొకరు అనే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలే అందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ‘విజయాలు వచ్చినప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి అందరూ ముందుంటారు, అపజయాలు ఎదురైనప్పుడే ఎవరూ ముందుకురారు’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారాయన. ఆస్ఎస్సెస్సే ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయించిందనే ప్రచారమూ జరుగుతోంది. ఇవన్నీ చూశాకే కమలం పార్టీకి కనువిప్పు కలిగిందని, పరిస్థితి చేజారుతోందని అధిష్టానం గుర్తించిందని తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. ఆదరాబాదరాగా బీహార్లో సీట్ల సర్దుబాటు చేసేసుకున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇలాంటి పరిస్థితే ఎదురుకావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014 మాదిరి ఒంటరిగా వెళితే పరాజయం తప్పకపోవచ్చని, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోక తప్పకపోవచ్చనీ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bihar, Bjp, Bjp-tdp, JDU, Nitish Kumar, Pm modi