news18-telugu
Updated: February 14, 2020, 3:03 PM IST
పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Pjhoto)
AP Politics | Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ డబుల్ రోల్ పాటిస్తోందా? ఓవైపు ప్రతిపక్ష జనసేనతో జట్టు కట్టి మరోవైపు అధికార వైసీపీతో తెరవెనక దోస్తీ చేస్తోందా? ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. కాపు వర్గాన్ని ఆకర్షించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపిన కమలం పెద్దలు... మరోవైపు... అధికారంలో ఉన్న వైసీపీకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా అమరావతి నుంచీ విశాఖకు రాజధానిని తరలిస్తూ... మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిన వైసీపీ... అందుకు కేంద్రం పెద్దల నుంచీ ఆల్రెడీ అనుమతి పొందిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే... మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న పవన్ కళ్యాణ్... ఇటీవల సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం ద్వారా రాజకీయాల్ని ఆయన వదిలేస్తారనే వాదనకు చెక్ పెట్టినట్లైంది.
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో 5 రాష్ట్రాల్లో ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల సహజంగానే ఏపీలో పార్టీలు బీజేపీతో దోస్తీకి ఆసక్తిగానే ఉన్నాయి. ఐతే... బీజేపీ మాత్రం టీడీపీని తప్ప మిగతా కీలక పార్టీలైన వైసీపీ, జనసేనతో సానుకూలంగా ఉంది. అందులోనూ జనసేనతో ఆల్రెడీ అధికారికంగానే పొత్తు పెట్టుకుంది. తాజాగా వైసీపీ కూడా బీజేపీతో జతకట్టి... కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జనసేన కచ్చితంగా బీజేపీకి గుడ్ బై చెప్పక తప్పదు. అలా చెయ్యకపోతే... ఏపీలో జనసేన ప్రత్నామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉండదు. ఇదే జనసేన అధినేతకు సవాలుగా మారింది.
ఒకవేళ వైసీపీ గనక బీజేపీతో చేతులు కలిపితే... పవన్ కళ్యాణ్... బయటకు వచ్చి సొంతంగా పోరాటం చెయ్యడమో లేక టీడీపీతో చేతులు కలపడమో చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఇవేవీ కాదనుకుంటే... పూర్తిగా రాజకీయాల్ని వదిలేసే అవకాశాలూ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఐతే... పార్టీ నడిపేందుకు డబ్బు కోసమే పవన్ కళ్యామ్... సినిమాలు చేస్తున్నారనీ... అలాంటప్పుడు ఆయన రాజకీయాల్ని ఎలా వదిలేస్తారని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
ఏపీలో ఎలాగైనా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఐతే... ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఎదిగే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్థానాన్ని టీడీపీ, జనసేన ఆక్రమించాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీతో దోస్తీ చేస్తే... ఏపీలో కూడా అధికారంలో భాగస్వామి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కమలనాథులు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై జనసేనలో హాట్ డిబేట్ నడుస్తోంది.
వైసీపీతో బీజేపీ కలిస్తే... అది కచ్చితంగా బీజేపీకి దెబ్బే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇప్పటికే రాజధాని అంశంపై వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నా్రు. కేంద్ర పెద్దలు మాత్రం రాజధాని తరలింపు అంశంపై ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. ఇలా రెండు వాదనలు వినిపిస్తుండటంతో బీజేపీకి కచ్చితమైన స్టాండేదీ లేదనే భావన ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇది ఏపీలో ఆ పార్టీకి కలిసిరాని అంశంగా చెబుతున్నారు. ఏపీ రాజకీయాల్ని ముందే ఊహించడం కష్టమంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజులైతే పిక్చర్లో కొంత క్లారిటీ వస్తుందంటున్నారు. అప్పటివరకూ ఇలా ఎన్ని రకాలుగానైనా విశ్లేషించుకోవచ్చని అంటున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
February 14, 2020, 5:46 AM IST