Modi vs Mamata: త్రిపురలో ఐప్యాక్ బృందం నిర్బంధం.. ప్రధాని మోదీ-మమతా భేటీలో ఇన్ సైడ్ టాక్ ఇదే..

మోదీ-మమతా భేటీ ఇన్ సైడ్ టాక్

మమతా బెనర్జీ రాజకీయ వ్యూహం ఎవరికీ అర్థం కావడం లేదు. మోదీ అంటేనే మండి పడ్డ ఆమె.. నిన్న ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరోవైపు ఇవాళ ఆమె సోనియా గాంధీని కూడా కలవనున్నారు. ఇంతకీ మోదీ-మమత మధ్య భేటీలో ఏం జరిగింది..?

 • Share this:
  వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలు తెలిసాయి.. పరిపాలన కూడా మొదలైంది. అయినా మోదీ-మమతా మధ్య ఫైట్ ఆగడం లేదు. రోజు రోజుకు బీజేపీ -టీఎంసీ మధ్య వివాదం ముదురుతూనే ఉంది. తాజా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్‌) సభ్యులు 23 మందిని త్రిపుర పోలీసులు ఒక హోటల్‌లో హౌస్‌ అరెస్టు చేశారు. ఈ వివాద అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. 2023లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐప్యాక్‌ బృందం వారం రోజుల కిందట అగర్తలాకు చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి త్రిపుర పోలీసులు వీరిని హోటల్‌ నుంచి బయటికి రానివ్వడం లేదు. దీంతో మరోసారి మమత వర్గం బీజేపీపై మాటల దాడి పెంచింది. బెంగాల్ లో ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న బీజేపీ.. ఇప్పుడు త్రిపుర చేజారిపోతుందని భయపడుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే కారణం ఐప్యాక్ టీం సభ్యులను అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు.

  త్రిపురలో తృణమూల్‌ ఇంకా అడుగుపెట్టకముందే బీజేపీ భయపడుతోంది. 23 మంది ఐప్యాక్‌ ఉద్యోగులను గృహనిర్భందంలో పెట్టారు. బీజేపీ అరాచక పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే పదేపదే ఖూనీ అవుతోంది అని తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ ట్వీట్‌ చేశారు. బయటినుంచి వచ్చినందున వారికి కరోనా పరీక్షలు చేశామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. త్రిపురలో బీజేపీ కొత్త సంప్రదాయానికి తెరలేపిందని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అతిథుల్లా చూసుకోకుండా.. ఇలా అవమానించడం దారుణమని ఆరోపిస్తున్నారు..

  ఇదే సమయంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రధాని మోదీతో భేటీ అవ్వడం ఆసక్తి పెంచుతోంది. అది కూడా ఢిల్లీ వెళ్లీ సోనియా గాంధీని కలుస్తారు అనుకుంటే.. ఆమె ప్లాన్ మార్చి మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె 7 లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవ‌ల బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఢిల్లీలో తొలిసారి క‌లుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని మ‌మ‌తా కోరిన‌ట్లు తెలుస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును మార్చాల‌న్న పెండింగ్ అంశాన్ని కూడా మోదీతో గుర్తు చేస్తున్న‌ట్లు దీదీ తెలిపారు. దీని గురించి ఆలోచిస్తామ‌ని మోదీ చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అలాగే పార్ల‌మెంట్‌లో దుమారం రేపుతున్న పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హించాల‌న్నారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని దీదీ కోరారు. వీరి మధ్య ఐప్యాక్ టీం అంశంపైనా నిర్బంధంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నేతల తీరు సరైంది కాదని ఆమె ప్రధానికి వివరించినట్టు సమాచారం. మరోవైపు ఇవాళ సోనియాతోనూ దీదీ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.
  Published by:Nagesh Paina
  First published: