పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినందుకు 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్టు ఈసీ తెలిపింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. ఈ సమయంలో మమతా ఎలాంటి ప్రచారంలో పాల్గొనరాదని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లంతా టీఎంసీకి ఓటు వేయాలని ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మమత పిలుపునిచ్చారు. దీంతో మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేతల బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
గత వారం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం రెండు నోటీసులను జారీచేసింది. మర్చి 28, ఏప్రిల్ 7వ తేదీలలో మమతా బెనర్జీ చేసిన ప్రసంగాలకు సంబంధించి వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. దీనిపై మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. అయితే మమతా వివరణను పరిశీలించిన ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మమత బెనర్జీ 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా ఉత్తర్వులు జారీచేశారు. ఇక, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సునీల్ అరోరా పదవీకాలం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే.
To protest against the undemocratic and unconstitutional decision of the Election Commission of India, I will sit on dharna tomorrow at Gandhi Murti, Kolkata from 12 noon.
— Mamata Banerjee (@MamataOfficial) April 12, 2021
ఇక, బెంగాల్‌లోఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. మిగిలిన మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి సమయంలో మమత ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడంపై టీఎంసీ శ్రేణులు మండిపడుతున్నాయి. తాను 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఈసీ నిషేధం విధించడంపై మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు మధ్యాహ్నం కోల్‌కతాలో ధర్నాకు దిగనున్నట్టు చెప్పారు. ‘భారత ఎన్నికల సంఘం అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయానికి నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కోల్‌కతాలోని గాంధీ మూర్తి వద్ద ధర్నా చేపడతాను’అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Election Commission of India, Mamata Banerjee, West Bengal Assembly Elections 2021