Mamata Banerjee: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై మమతా బెనర్జీ సీరియస్​.. విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు..!

ప్రతీకాత్మకచిత్రం

నిజానికి పెగాసస్ స్పైవేర్‌పై కేంద్ర ప్రభుత్వమే విచారణ చేయాల్సి ఉందని.. కానీ అందుకు మోడీ ప్రభుత్వం ఇష్టపడటం లేదని మమతా బెనర్జీ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం ఆమె పెగాసస్ స్పైవేర్‌ గురించి వస్తున్న ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

  • Share this:
పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక ఎంక్వయిరీ కమిషన్​ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ హ్యాకింగ్, ట్రాకింగ్, మొబైల్ ఫోన్‌ల రికార్డింగ్ లపై ప్రత్యేక ఎంక్వయిరీ కమిషన్ దర్యాప్తు చేస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​ లతో ఈ ద్విసభ్య కమిషన్​ ఏర్పాటయింది. అయితే ఈ ప్యానెల్ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించనుంది.

నిజానికి పెగాసస్ స్పైవేర్‌పై కేంద్ర ప్రభుత్వమే విచారణ చేయాల్సి ఉందని.. కానీ అందుకు మోడీ ప్రభుత్వం ఇష్టపడటం లేదని మమతా బెనర్జీ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం ఆమె పెగాసస్ స్పైవేర్‌ గురించి వస్తున్న ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్ పై దర్యాప్తు చేస్తుందని తాము భావించామని ఆమె అన్నారు. కానీ అలా జరగలేదు కాబట్టే తాము అధికారికంగా విచారణ చేపడుతున్నామని ఆమె వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆమె మరిన్ని సంచలన విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తన మొబైల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేస్తుందేమోనని.. తన మొబైల్ కెమెరాని ప్లాస్టిక్ కవర్ తో చుట్టినట్టు ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో జరిగే తన సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిఘాలో పెట్టిందని ఆమె ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ తో పాటు మరికొందరితో తాను సమావేశంలో పాల్గొన్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆ సమావేశాన్ని కొందరు రహస్యంగా విన్నారని ఆమె ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను పరిశీలించిన తర్వాత పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ సమావేశాలలో ఒకటి వారికి (ప్రభుత్వానికి) తెలిసిందని మమతా సంచలన ఆరోపణలు చేశారు. పెగాసస్ చాలా ప్రమాదకరమైనదని.. వారు ప్రజలను వేధిస్తున్నారని.. కొన్నిసార్లు తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఒడిషా ముఖ్యమంత్రులతో తాను మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు.

అంతేకాదు, ఆమె స్పైవేర్‌ని ఒక గూండాగిరి గా అభివర్ణించారు. స్పైగిరి జరుగుతోందని.. మంత్రులు, న్యాయమూర్తులు, పౌర సమాజం, ఎన్నికల సంఘం, మీడియా ఇలా చెప్పుకుంటూపోతే ప్రతీ వ్యవస్థ నిఘా నీడలో ఉందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్య రాష్ట్రానికి బదులుగా వారు దానిని నిఘా రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారని మమతా బెనర్జీ అన్నారు.

అయితే మమతా బెనర్జీ పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ అమిత్ మాలవీయ కూడా మమతాపై కామెంట్ చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు చేయడానికి, బెంగాల్‌లో అనేక కోవిడ్ కుంభకోణాలను దర్యాప్తు చేయడానికి మమతా బెనర్జీ దృష్టి సారిస్తే బాగుండేదని మాలవీయ ఎద్దేవా చేశారు.
Published by:Krishna Adithya
First published: