Home /News /politics /

West Bengal Polling: పశ్చిమ బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్.. లేటెస్ట్ అప్‌డేట్స్

West Bengal Polling: పశ్చిమ బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్.. లేటెస్ట్ అప్‌డేట్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

west bengal elections: ఆరో విడతలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగుతున్నాయి. 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ జరుగుతున్న ఈ నియోజకవర్గాల్లో 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

  పశ్చిమ బెంగాల్‌లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధలను పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచేపోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 17.19 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈస్ట్ బుర్ద్వాన్‌లో 18.93, నార్త్ దినాజ్‌పూర్‌లో 18.84,  నదియాలో 18.20 నార్త్ 24 పరగణాస్‌లో 14.84శాతం పోలింగ్ నమోదయింది. నాలుగో విడత పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఆరో విడత పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  ఐతే పోలీంగ్‌కు కొన్ని గంటల ముందు పూర్వ బర్దమాన్ జిల్లా కేతుగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. చినీస్‌పూర్ గ్రామంలోని ఓ ఇంటి సమీపంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  ఆరో విడతలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగుతున్నాయి. 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ జరుగుతున్న ఈ నియోజకవర్గాల్లో 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 53.21 లక్షల మంది పురుషులు, 50.65 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. 256 థర్డ్ జెండర్స్ ఉన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

  బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న ముగిశాయి. నేడు ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఇక ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న బెంగాల్ న్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు. గెలుపుపై బీజేపీ, టీఎంసీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: 5 State Elections, Mamata Banerjee, West Bengal, West Bengal Assembly Elections 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు