దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ రేట్లు ఇప్పటికే సెంచరీ మార్క్ దాటాయి. మిగత రాష్ట్రాల్లోనూ త్వరలో ఇదే పరిస్థితి రానుంది. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా గురువారం వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ కారులో ప్రయాణించలేనంటూ ఎలక్ట్రిక్ స్కూటీపై సచివాలయానికి వెళ్లారు. కోల్‌కతా మేయర్ స్కూటీ నడిపితే ఆమె వెనకాల కూర్చొని.. కోల్‌కతా రోడ్లపై ప్రయాణించారు.
సాయంత్రం సచివాలయం నుంచి వచ్చేటప్పుడు.. మమతా బెనర్జీ స్కూటీ నడిపే ప్రయత్నం చేశారు. కానీ ఆమెకు స్కూటీ పర్ఫెక్ట్గా రాదు. ఐనప్పటికీ వ్యక్తిగత సహాయ సిబ్బంది స్కూటీని పట్టుకొని..ఆమెకు నేర్పించే ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్యాలెన్స్ అదుపుతప్పి మమతా బెనర్జీ కింద పడబోయారు. పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై బండి కింద పడకుండా నిలువరించారు. ఆ తర్వాత స్కూటీ వెనకాల కొందరు, ముందు హ్యాండిల్‌ను మరికొందరు పట్టుకోగా.. కొద్ది దూరం పాటు బండిని నడిపారు మమతా. అనంతరం మేయర్ ఫిర్హద్ హకీం స్కూటీని నడిపి.. సీఎం మమతా బెనర్జీ వెనక ఎక్కించుకున్నారు. ఇలా సచివాలయం నుంచి కాళీ ఘాట్ వరకు ప్రయాణించారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee nearly falls while driving an electric scooter in Howrah, as a mark of protest against fuel price hike. She quickly regained her balance with support and continued to drive.
కోల్‌కతాలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అతి త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కానీ ఇప్పటికే బీజేపీ, టీఎంసీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచార సభల్లో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అటు నేతల జంపింగ్‌లు.. కొత్త వారి చేరికలతో.. బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.