West Bengal Polls: పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ రక్తసిక్తం.. కాల్పుల్లో నలుగురు మృతి.. మరోచోట యువ ఓటర్ దారుణ హత్య..

(Image- Twitter)

ప‌శ్చిమ బెంగాల్‌లో నాల్గొవ విడత పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

 • Share this:
  ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగ‌వ విడత పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. కూచ్ బెహ‌ర్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వెలుపల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా టీఎంసీ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సీతల్‌కుచిలోని బూత్ నెంబర్ 126లో జరిగిన కాల్పుల్లో తమ పార్టీకి చెందిన 5 గురు కార్యకర్తలు మరణించినట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ఈ రోజు ఉదయం నుంచి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకుండా బీజేపీ దుండగులు అడ్డుకుంటున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు బీజేపీకి ఓటు వేసేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ప్రజలను ఓటు వేసేందుకు అనుమతించకపోవడంపై ఆరా తీసేందుకు వెళ్లిన టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ దుండగులు దాడి చేసి.. ఆందోళనకరమైన వాతావరణం సృష్టించారు. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో 5గురు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని’ అని టీఎంసీ పేర్కొంది.

  మరోవైపు పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో మృతిచెందిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన ఘటన విచారకరం... మృతుల కుటుంబాలకు నేను సంతాపం తెలియజేస్తున్నాను. బెంగాల్‌లో బీజేపీకి మద్దతు పెరుగుతున్నందున మమతా దీదీ మరియు ఆమె గూండాలు ఇలాంటి దాడులకు దిగుతున్నారు’ అని ఆరోపించారు. ఇక, ఈ క్రమంలోనే సీతల్‌కుచిలోని బూత్ నెంబర్ 126లో‌ పోలింగ్‌ను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాల్సిందిగా పోలింగ్ విధుల్లో ఉన్న అధికారులను కోరింది.

  తొలిసారి ఓటు వేసేందుకు వచ్చి హత్యకు గురైన యువ ఓటర్..
  సీతల్‌కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని Pathantuli ప్రాంతంలోని పోలింగ్ బూత్ నెంబర్ 85లో తొలి సారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన యువ ఓటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు.. పోలింగ్ బూత్‌ నుంచి బయటకు లాక్కొని వచ్చి హత్య చేశారు. చనిపోయిన యువ ఓటర్‌ను ఆనందర్ బూర్మన్‌గా గుర్తించారు. అయితే ఈ హత్య వెనక బీజేపీ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం హత్యకు గురైన వ్యక్తి తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ అని.. ఈ ఘటన వెనక తృణమూల్ కుట్ర ఉందని చెప్పుకొచ్చింది. ఇక, ఈ ఘటన అనంతరం పోలింగ్ బూత్ వెలుపల టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ఈ ఘర్షణల్లో బాంబులు ఇరువర్గాలు బాంబులు విసురుకోవడంతో.. పలువురు గాయపడ్డారు.

  ఆర్టీసీ కార్మికులు సమ్మె.. రూ. 10 లక్షల పరిహారం కోరుతూ బీఎంటీసీకి లీగల్ నోటీసు పంపిన విద్యార్థిని.. రీజన్ మాత్రం మాములుగా లేదుగా..

  ఇక, బెంగాల్‌లో ఈ విడతలో మొత్తం 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హౌరా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ సహా ఉత్తర బెంగాల్‌లోని రెండు జిల్లాల్లోని కోటి 15 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు బెంగాల్ మంత్రులు పార్థ చటర్జీ, అరూప్ బిశ్వాస్ సహా ఉద్ధండులు ఈ విడుతలో పోటీ పడుతున్నారు. మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 15,940 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. మొత్తం 789 కంపెనీల కేంద్ర బలగాలు సెక్యూరిటీ కల్పిస్తున్నాయి. సాయంత్రం 6.30 వరకూ పోలింగ్ జరగనుంది.
  Published by:Sumanth Kanukula
  First published: