West Bengal Assembly Elections 2021: బెంగాల్‌లో మమత, బీజేపీ మధ్య హోరాహోరీ... అసలేం జరుగుతోంది ?

నరేంద్రమోదీ, మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా, శక్తిమంతమైన నేతగా మమతా తన స్థానం పదిలం చేసుకున్నప్పటికీ ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య బాగా పెరగటం చూస్తుంటే ఈ ఎన్నికలు మమతకు పెద్ద సవాలుగా నిలిచాయని చెప్పక తప్పదు.

  • Share this:
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ, ఆరోపణలు, ప్రత్యారోపణలతో బెంగాల్ రాజకీయాలు దద్దరిల్లుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (West Bengal Assembly Elections) త్రిముఖ పోటీ నెలకొంది. అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (BJP), ఇటీవలే ఏర్పడ్డ కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కూటమి మధ్య ముక్కోణ పోటీ ఆసక్తిగా మారుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే లో జరుగనున్న ఈ ఎన్నికలపై యావత్ దేశం అమితాసక్తి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్తున్న జంప్ జిలానీల సంఖ్య విపరీతంగా పుంజుకోగా, దూకుడు మీద ఉన్న బీజేపీ ఎలాగైనా బెంగాల్ రాజకీయాల్లో పాగా వేయాలని సర్వం ఒడ్డుతోంది. చెప్పేందుకు ముక్కోణ పోటీ అయినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఎంసీ, బీజేపీల మధ్యనే ఉండబోతోంది.

అధికారం దక్కేనా?
ఇప్పటి వరకూ బెంగాల్ లో ఒక్కసారి కూడా అధికారం చేపట్టని కమలనాథులు ఇటీవల స్థానిక ఎన్నికల్లో బాగానే పుంజుకున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 42 లోక్ సభ స్థానాలకు గానూ 18 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఇదే ఊపు మీద దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ ను బాగా పెంచుకున్న బీజేపీ తన శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. 2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ 10.16శాతం ఓట్ షేర్ సాధించగా 2019 వచ్చేసరికి 40.64శాతం ఓట్ షేర్ సొంతం చేసుకున్న బీజేపీ రాష్ట్రంలో రాజకీయంగా పాగా వేసేందుకు గట్టి కసరత్తులే చేస్తోంది. దీదీ రాజ్యాన్ని అంతం చేస్తామనే ధీమాతో ఉన్న కమలనాథులు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బెంగాల్ ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామని హామీలు గుమ్మరిస్తున్నారు.

ఇటీవలే 2 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ బెంగాల్ విభాగంలో నయా జోష్ నింపారు. అమిత్ షా (Amit Shah) రోడ్ షోకు జనం ఎగబడిరావటం చూస్తుంటే బెంగాలీలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోందని కాషాయపార్టీ ఉత్సాహంగా ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బెంగాలీలు ఆగ్రహంతో ఉన్నారని, ఆమెను సాగనంపటం ఖాయమని అమిత్ షా ప్రకటనలు సైతం గుమ్మరించారు. టీఎంసీలో కీలక నేత అయిన సువేందు అధికారి కూడా బీజేపీలో చేరటంతో రాష్ట్రంలో పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చినట్టైంది. సీఎం మమతా బెనర్జీకి ( Mamata Banerjee) సన్నిహితుడైన సువేందు, ఆమె పనితీరుపై చక్కని అవగాహన ఉన్న వ్యక్తి కావటం బీజేపీ రాజకీయ లబ్ది చేకూర్చనుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

దీదీ హ్యాట్రిక్ కొడతారా?
2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 184 స్థానాలు సాధించిన టీఎంసీ-కాంగ్రెస్ కూటమి వామపక్షాలకు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఆతరువాత వెనుతిరిగి చూడని దీదీ, 2016లో ఒంటరిగానే పోటీ చేసి 211 స్థానాలు సాధించి, రాష్ట్రంలో టీఎంసీని ఎదురులేని పార్టీగా నిలబెట్టారు. ఇక 2019 వచ్చేసరిగా జాతీయ నేతగా ఇమేజ్ సంపాదించిన మమతా, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయటంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీయేతర పార్టీలతో మెగా ర్యాలీ సైతం నిర్వహించిన దీదీ బీజేపీని ఏకాకిని చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలకు పరిమితమై, కేవలం 44శాతం ఓట్ షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ నుంచి వస్తున్న గట్టి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతేడాదే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సేవలను ఉపయోగించుకుంటున్న టీఎంసీ ఎలాగైనా హ్యాట్రిక్ సాధించే లక్ష్యంతో శ్రమిస్తోంది.

చెదరని తృణముల్ ఓటు బ్యాంక్
మత రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న బీజేపీకి దూరంగా ఉండాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలని బెంగాలీలను దీదీ కోరుతున్నారు. మరోవైపు తృణముల్ ఇమేజ్ కు మేకోవర్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్, ప్రజలకు దీదీని మరింత చేరువగా చేసే పథకాలను డిజైన్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నప్పటికీ తృణముల్ ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కుచెదరకపోవటం విశేషం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా, శక్తిమంతమైన నేతగా మమతా తన స్థానం పదిలం చేసుకున్నప్పటికీ ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య బాగా పెరగటం చూస్తుంటే ఈ ఎన్నికలు మమతకు పెద్ద సవాలుగా నిలిచాయని చెప్పక తప్పదు. మరోవైపు బీజేపీకి పంటికింద రాయిలా మారిన దీదీని ఎలాగైనా ఇంటికి సాగనంపాలనే తహతహలో కమలనాథులు తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.


లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి
గతవారంలోనే తాము వామపక్షాలతో జతకడుతున్నట్టు వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలకు గట్టి దెబ్బ రుచి చూపుతామని బీరాలు పలుకుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి 76 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగిన కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించి 5.6శాతం ఓట్ షేర్ సాధించింది. మరోవైపు వామపక్ష పార్టీలు మాత్రం కనీసం ఒక్క సీటు సాధించలేక చతికిల పడ్డాయి. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేనప్పటికీ.. లెఫ్ట్ పార్టీల లాయల్ ఓటర్ బేస్ ను బీజేపీ వైపు పోకుండా అడ్డుకట్ట వేయటంపై ఫోకస్ పెడుతున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published: