Dalitha Bandhu: దళిత బంధు పథకానికి రూ.లక్ష కోట్లు.. అర్హులందరికీ రూ.10 లక్షల సాయం

తెలంగాణ సీఎం కేసీఆర్

Dalitha Bandhu Scheme: హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు.

  • Share this:
    అర్హులైన దళితులందరికీ దళిత బంధు (Dalitha Bandhu) పథకం అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) స్పష్టం చేశారు. కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని అన్నారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

    హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకోసం పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

    దళిత సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రకటించింది. రూ.1200 కోట్లతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెెలిపింది. అర్హులైన దళిత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తారు. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందిస్తారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు ప‌థ‌కం మాదిరిగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జ‌మ చేస్తారు. వృద్ధాప్య పించన్లు, రైతు బంధు పంపిణీ తరహాలోనే ఇది పథకం కూడా పారదర్శకంగా అమలుకానుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

    దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందని చెప్పారు. అందుకోసం అదనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఖర్చు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి స్థాయి వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు.

    మరోవైపు దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు హుజూరాబాద్‌కు చెందిన 412 మంది దళితులతో సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన కల్పిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: