Home /News /politics /

Amaravati | మేకప్ వేసుకుని వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై సెటైర్లు...

Amaravati | మేకప్ వేసుకుని వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై సెటైర్లు...

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

మందడంలో నిర్వహించిన రిలే దీక్షల్లో రైతులు కొందరు ముఖానికి మేకప్ వేసుకుని వచ్చారు. మహిళలు, పురుషులు కూడా ముఖానికి మేకప్ వేసుకుని వచ్చి నిరసన తెలిపారు.

    అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన రైతుల పోరాటం 64వ రోజు కూడా కొనసాగుతోంది. అయితే, ఈ రోజు మందడంలో నిర్వహించిన రిలే దీక్షల్లో రైతులు కొందరు ముఖానికి మేకప్ వేసుకుని వచ్చారు. మహిళలు, పురుషులు కూడా ముఖానికి మేకప్ వేసుకుని వచ్చి నిరసన తెలిపారు. ‘మాకు మేకప్ వద్దు.’, ‘మాకు అమరావతి కావాలి.’ అని డిమాండ్‌ చేశారు. అమరావతిలోని చాలా గ్రామాలు తాడేపల్లి నియోజకవర్గంలోకి వస్తాయి. కొన్ని మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తాయి. అయితే, ఆ రెండు నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో వైసీపీకి చెందిన వారు విజయం సాధించారు. తాడేపల్లి నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే, రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని సీఎం జగన్ డిసైడ్ అయిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. దీంతోపాటు 64 రోజుల నుంచి రైతులు నిరసనలు తెలుపుతున్నా కూడా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనీసం తమను పరామర్శించకపోవడం రైతుల్లో మరింత ఆగ్రహానికి కారణం అవుతోంది.

    మందడంలోని రైతు దీక్ష శిబిరంలో ముఖానికి మేకప్ వేసుకుని నిరసన తెలుపుతున్న మహిళలు


    రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ నలుగురు యువకులు నెల రోజుల క్రితం తుళ్లూరులోని సెల్ టవర్ ఎక్కారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించకపోతే తాము అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చే వరకు తాము సెల్ టవర్ దిగబోమని ప్రకటించారు.

    ‘13 జిల్లాల వారు బాగుండాలనే ఉద్దేశంతో మేం భూములు ఇచ్చాం. మిగిలిన రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్నాం. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. జగన్‌కు చేతకాకపోతే ఆయన్ను దీన్ని అలాగే వదిలిపెట్టమనండి. మేమే అమరావతిని నిర్మిస్తాం. జగన్‌, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరికీ ఆఫీసులు, క్వార్టర్స్ కట్టిస్తాం. వారికి దండం పెడుతున్నాం. రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దు. రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు నోరెత్తడం లేదు. మాకు ఏ కులం, పార్టీలు లేవు. పార్టీలతో మాకు సంబంధం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మాకు అండగా ఉండాలి. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. రైతుల ఉసురు ఊరికేపోదు. నీకు దండం పెడతా శ్రీదేవి తల్లీ. ఒక్కసారి మా దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం.’ అని అప్పట్లో ఆ రైతులు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Vundavalli sridevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు